భారత హాకీ జట్టు(ఫైల్ ఫోటో)
క్వాంటాన్(మలేషియా):ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భాగంగా ఆదివారం భారత్తో జరిగే మ్యాచ్లో గట్టిపోటీ ఇస్తామని పాకిస్తాన్ కోచ్ ఖవాజా జునైద్ పేర్కొన్నాడు. అసలు ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఎప్పుడూ భావోద్వేగాలు నిండి వుంటాయని, అయితే రేపటి మ్యాచ్ ఎటువంటి గంభీర వాతావరణం లేకుండా జరగాలని కోరుకుంటున్నట్లు జునైద్ తెలిపాడు.
'భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ అంటే ఎప్పుడూ భావోద్వేగంగా ఉంటుంది.ఇరు జట్ల మధ్య పోరు అంటే లక్షల సంఖ్యలో అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తారు. ఇరు జట్ల వల్లే హాకీకి మరింత పాపులారిటీ వచ్చిందని అనుకుంటున్నా. భారత్ తో మ్యాచ్లో గట్టిపోటీ ఇవ్వడానికి పాక్ యువకులు సిద్ధంగా ఉన్నారు. మా జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉంటే, భారత జట్టులో అనుభవం మెండు. మా అనుభవ లేమిని రేపటి మ్యాచ్లో అధిగమించాల్సి ఉంది. మేము ఒక సంవత్సరకాలంలో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ మాత్రమే ఆడాం. మరోవైపు గత ఐదేళ్లలో భారత్ 200కు పైగా మ్యాచ్లు ఆడింది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకావద్దని మా కుర్రాళ్లకు చెప్పా'అని జునైద్ పేర్కొన్నాడు.