
చివరి వన్డేకు మ్యాక్స్ వెల్ అనుమానం
కాన్బెర్రా: టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం జరుగనున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు మ్యాక్స్ వెల్ ఆడే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. బుధవారం జరిగిన నాల్గో వన్డే లో ఇషాంత్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఓ బంతి మ్యాక్స్ వెల్ కుడి మోకాలను బలంగా తాకింది. ఇషాంత్ లెగ్ సైడ్ వేసిన బంతిని అందుకునే క్రమంలో దాటిగా ఆడబోయిన మ్యాక్స్ వెల్ ముందుకు వంగబోయి గాయపడ్డాడు. దీంతో మ్యాక్స్ వెల్ చివరి వన్డే తుది జట్టులో ఆడే అవకాశాలు కనబడుట లేదు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంకా మ్యాక్స్ వెల్ కాలి గాయం వాపు తగ్గలేదని స్పష్టం చేసింది. అతనికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం కావొచ్చని తెలిపింది.
ఆ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 13 పరుగుల వద్ద ఉండగా గాయపడ్డాడు. ఆ తరువాత గాయాన్ని లెక్కచేయకుండా దూకుడుగా ఆడిన మ్యాక్స్ వెల్ 20 బంతుల్లో 41 పరుగులు నమోదు చేశాడు.