సాక్షి, హైదరాబాద్: వి.పురుషోత్తం స్మారక ఇంటర్ స్కూల్ హాకీ టోర్నమెంట్ మంగళవారం జింఖానా మైదానంలో ప్రారంభమైంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) సహకారంతో హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతుంది. హెచ్‌హెచ్ ఏర్పాటయ్యాక అధికారికంగా నిర్వహిస్తున్న తొలి టోర్నీ ఇదే కావడం విశేషం. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా టోర్నీని ప్రారంభించారు.
ట్రిపుల్ ఒలింపియన్, హెచ్‌హెచ్ కార్యదర్శి ఎన్.ముకేశ్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. బాలుర విభాగంలో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో 12 జట్లు పోటీ పడుతుండగా, బాలికల విభాగంలో లీగ్ ప్రాతిపదికగా 5 జట్లు తలపడుతున్నాయి. ఇందులో రాణించిన ఆటగాళ్లను జాతీయ స్థాయిలో జరిగే కె.డి. సింగ్‌బాబు అండర్-14 టోర్నీకి ఎంపిక చేస్తారు.