
ముంబై: స్వదేశంలో మరో టైటిల్ చేజిక్కించు కోవడానికి భారత ఫుట్‌బాల్ జట్టు విజయం దూరంలో ఉంది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా నేడు జరిగే ఫైనల్లో కెన్యాతో భారత్ తలపడనుంది. ఆరంభంలో వరుస విజయాలతో జోరు ప్రదర్శించి... చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య పరాజయం పాలైన భారత జట్టు ఫైనల్లో మాత్రం నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా ఆడాలని పట్టుదలతో ఉంది. లీగ్ దశలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గోల్ కొట్టే అవకాశం కూడా ఇవ్వకుండా చెలరేగిన భారత్ 3–0తో విజయం సాధించింది.
ఆ మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్‌తో సత్తాచాటాడు. అదే ప్రదర్శనను తిరిగి పునరావృతం చేయాలని భారత జట్టు భావిస్తుండగా... లీగ్ దశలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని కెన్యా చూస్తోంది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 6 గోల్స్‌తో తిరుగులేని ఫామ్‌లో ఉన్న కెప్టెన్ చెత్రితో పాటు మరో స్ట్రయికర్ జెజే లాల్‌పెక్లువా ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నారు. చివరి లీగ్ మ్యాచ్‌లో కెన్యా 4–0తో చైనీస్ తైపీపై విజయం సాధించి... న్యూజిలాండ్‌ను వెనక్కు నెట్టి ఫైనల్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సమరం ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో మాత్రమే భారత్ ఓటమి పాలవగా... కెన్యా 2–1తో న్యూజిలాండ్‌పై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment