రాజసం తిరిగొస్తుందా ? | IPL 2014 Auction: Rajasthan Royals’ Team Strategy‎ | Sakshi
Sakshi News home page

రాజసం తిరిగొస్తుందా ?

Published Thu, Apr 10 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

shane watson

shane watson

 రాజస్థాన్ రాయల్స్
 

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండే జట్టు ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ రాయల్సే. అంచనాలేమీ లేకుండానే బరిలోకి దిగడం. అనామకులతోనే ప్రత్యర్థికి చుక్కలు చూపించడంలో ఈ టీమ్‌ది అందెవేసిన చేయి. టి20లకు స్టార్లు అవసరం లేదని, నైపుణ్యం ఉన్న యువ క్రికెటర్లను స్టార్లను చేయొచ్చని రాజస్థాన్ చేసి చూపించింది. అంతేకాదు అత్యంత పొదుపైన జట్టు కూడా ఇదే. ఆటగాళ్లపై తక్కువగా ఖర్చుచేసి.. ఎక్కువగా ప్రతిఫలాన్ని పొందడం రాయల్స్ ఫ్రాంచైజీకి వెన్నతో పెట్టిన విద్య.

 ‘షేన్’ సెంటిమెంట్ ఫలించేనా?
 ఐపీఎల్ ఆరో సీజన్ వరకు రాజస్థాన్ జట్టును దిగ్గజ క్రికెటర్లు ముందుండి నడిపించారు. తొలుత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్, ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్  కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరి ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి రాణించింది. ఐపీఎల్-1లో రాయల్స్‌ను వార్న్ విజేతగా నిలపగా.. గత సీజన్‌లో చాంపియన్స్ లీగ్ టి20లో రన్నరప్‌గా నిలిచింది ద్రవిడ్ కెప్టెన్సీలోనే.

 అయితే ద్రవిడ్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పడంతో ఈసారి జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్‌వాట్సన్‌కు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ ఆరంభం నుంచి వాట్సన్ ఈ జట్టుతోనే ఉన్నాడు. దీంతో పాటు ‘షేన్’ సెంటిమెంట్ కలిసొస్తుందని యాజమాన్యం భావిస్తోంది. ఇక రాయల్స్ ఫ్రాంచైజీ షేన్ వాట్సన్‌తో పాటు జేమ్స్ ఫాల్క్‌నర్, అజింక్యా రహానె, సంజు శామ్సన్, స్టువర్ట్ బిన్నీలను కొనసాగించుకుంది. వేలంలో మరోసారి దేశవాళీ క్రికెటర్లకే పెద్దపీట వేసింది. అదే సమయంలో టి20లకు సరిగ్గా సరిపోయే విదేశీ ఆటగాళ్లను దక్కించుకుంది.  

 వివాదాలకు కేరాఫ్...
 రాజస్థాన్ రాయల్స్‌ను ముందు నుంచీ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2013 సీజన్‌లోనైతే ఈ జట్టు పతాక శీర్షికలకు ఎక్కింది. ఇందుకు కారణం రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కోవడం.. అలాగే జట్టు యజమాని రాజ్‌కుంద్రాపై బెట్టింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్ ఉక్కిరిబిక్కిరైంది. సుప్రీం గడప తొక్కిన ఈ వ్యవహారంలో సస్పెన్షన్ నుంచి కాస్తలో తప్పించుకుంది.

 బలాలు...
 షేన్ వాట్సన్‌తో పాటు మిగిలిన విదేశీ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్ ప్రధాన బలం. భారత ఆటగాడు అజింక్యా రహానే నిలకడైన ఆట.. ఎప్పటిలాగే యువ ఆటగాళ్లపైనే ఆధారపడటం రాయల్స్ బలాలుగా చెప్పవచ్చు.
 
 బలహీనతలు...

 విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడటం.. రహానేను మినహాయిస్తే భారత స్టార్లు లేకపోవడం. ముఖ్యంగా భారత జట్టుకు ఆడిన ప్రధాన బౌలర్లు లేకపోవడం బలహీనత.

 
 జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: అజింక్యా రహానే, స్టువర్ట్ బిన్నీ, అభిషేక్ నాయర్. విదేశీ క్రికెటర్లు: షేన్ వాట్సన్, జేమ్స్ ఫాల్క్‌నర్, స్టీవెన్ స్మిత్, బ్రాడ్ హాడ్జ్,  కేన్ రిచర్డ్సన్, బెన్ కటింగ్ (ఆస్ట్రేలియా), టిమ్ సౌతీ(న్యూజిలాండ్), కెవాన్ కూపర్(వెస్టిండీస్).


 భారత దేశవాళీ క్రికెటర్లు: సంజు శామ్సన్, రజత్ భాటియా, ధావల్ కులకర్ణి,  కరుణ్ నాయర్, ఉన్ముక్త్ చంద్, ఇక్బాల్ అబ్దుల్లా, దీపక్ హుడా, దిశాంత్ యాగ్నిక్, విక్రమ్‌జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాటియా, అంకుశ్ బైన్స్, ఎ. మిశ్రా, ప్రవీణ్ తాంబే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement