సెహ్వాగ్‌ మాటను నిజం చేసిన గేల్‌..! | Chris Gayle Name A Record Maximum Centuries In IPL | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 20 2018 11:40 AM | Last Updated on Sat, Apr 21 2018 2:07 PM

Chris Gayle Name A Record Maximum Centuries In IPL - Sakshi

విజయానంతరం ప్రీతి జింటాతో గేల్‌

మొహాలీ: ఐపీఎల్‌-2018లో సంచలనాల నమోదుకు సమయం ఆసన్నమైంది. సిక్స్‌లు, పోర్ల వేడుకకు వేళయింది. పరుగుల పండగకు తెర లేచింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య గురువారం మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ తన అద్భుత సెంచరీతో క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించాడు. పటిష్టమైన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. 63 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ వేలంలో గేల్‌ కొనుగోలుపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించక పోవడంతో నామమాత్రపు ధరకు పంజాబ్‌ అతన్ని కొనుగోలు చేసింది. అయితే 11 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో గేల్‌ సాగించిన పరుగుల వరద తాను ఎంత విలువైన ఆటగాడినో అని మిగతా ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లయింది. గేల్‌ ధనాధన్‌ సిక్స్‌లతో ఐఎస్‌ బింద్రా క్రికెట్‌ స్టేడియం చిన్నపాటి క్లబ్‌ గ్రౌండ్‌లా మారిపోయింది. 

నేనే రక్షించా.. సెహ్వాగ్‌ ట్వీట్‌
మొన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ రెచ్చిపోయిన గేల్‌ 33 బంతుల్లో 4 సిక్స్‌లు, 7 ఫోర్లతో 63 పరుగులు చేసి పంజాబ్‌కు విజయాన్నందించాడు. ఐపీఎల్‌ వేలంలో చివరగా.. గేల్‌ను నామమాత్రపు ధరకు ప్రీతి జింటా సహ యజమానిగా గల పంజాబ్‌ జట్టు కొనుగోలు చేసిన అనంతరం ఒక సందర్భంలో ఆ జట్టు కోచ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ‘గేల్‌ పంజాబ్‌కు రెండు విజయాలు అందించినా చాలు.. అతనిపై పెట్టిన పెట్టుబడికి న్యాయం జరిగినట్లే’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. గురువారం ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయానంతరం గేల్‌ను వెళ్లిపోకుండా చేసి ఐపీఎల్‌ను తానే రక్షించినట్లు సెహ్వాగ్‌ ఓ సరదా ట్వీట్‌ చేయగా.. అవునంటూ గేల్‌ బదులిచ్చాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల రికార్డూ గేల్‌ పేరునే ఉంది. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు తరపున బరిలోకి దిగిన గేల్‌ పూణె వారియర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 175 పరుగుల సునామీని సృష్టించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement