చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఐపీఎల్‌లో బలమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఒకటి కానీ ట్రోఫీ మాత్రం ఈ జట్టుకు అందని ద్రాక్షలా మిగిలింది. కనీసం ఈ సారైనా తమ అభిమాన జట్టు ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తొలి పోరులోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టుతో కోహ్లి సేన తలపడుతోంది. అందులోనూ చెన్నైలోని చెపాక్ మైదానంలో. మామూలుగానే గర్జించే సీఎస్‌కే జట్టు సొంతమైదానంలో బెబ్బులిలా రెచ్చిపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చెపాక్‌లో ఆర్సీబీకి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇక్కడ ఆర్సీబీకీ కూడా అంత ఘనమైన రికార్డులేమి లేవు. చివరగా ఆడిన ఏడింటిలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.
సీఎస్‌కే కంచుకోట
ఏ జట్టుకైనా సొంతమైదానంలో ఆడటం అదనపు బలం. అయితే సీఎస్‌కేకు అంతకుమించి. చెన్నైలోని చెపాక్ స్టేడియం ధోనిసేనకు కంచుకోట వంటిది. సీఎస్‌కే ఇక్కడ చివరగా ఆడిన 13 మ్యాచ్‌లో కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. ఇక 2008లో అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఆర్సీబీ చివరగా చెపాక్‌లో సీఎస్‌కేను 14 పరుగుల తేడాతో ఓడించింది. సీఎస్‌కే బలమైన జట్టు అనడంలో సందేహమేలేదని.. కానీ తమ వ్యూహాలు తమకున్నాయని ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment