అమీతుమీకి ఢిల్లీ , హైదరాబాద్‌.. | IPL 2019 Elimination Match in Visakhapatnam | Sakshi
Sakshi News home page

అమీతుమీకి సిద్ధం

Published Tue, May 7 2019 11:58 AM | Last Updated on Tue, May 7 2019 11:58 AM

IPL 2019 Elimination Match in Visakhapatnam - Sakshi

విశాఖకు చేరిన సన్‌రైజర్స్‌ ,ఢిల్లీ క్యాపిటల్స్‌

విశాఖ స్పోర్ట్స్‌: అమీతుమీకి ఢిల్లీ కాపిటల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు సిద్ధమవుతున్నాయి. విశాఖ వేదికగా బుధవారం జరగనున్న ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇరుజట్లు సోమవారం ప్రత్యేక విమానాల్లో విశాఖ చేరుకున్నాయి. ఏకంగా 18 పాయింట్లు సాధించినా ఢిల్లీ కాపిటల్స్‌ జట్టు తృతీయ స్థానానికే పరిమితమై ఎలిమినేషన్‌ రౌండ్‌ ఆడాల్సి రాగా.. కేవలం 12 పాయింట్లతో సన్‌రైజర్స్‌ జట్టు ప్లేఆఫ్స్‌లో నాకవుట్‌ మ్యాచ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ఢిల్లీ జట్టు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా రెండు సార్లు హాట్రిక్‌ విజయాలు సాధించగా.. సన్‌రైజర్స్‌ ఒక హాట్రిక్‌ విజయాన్ని, మరో హాట్రిక్‌ పరాజయంతో లీగ్‌ ముగించింది. నిరుటి రన్నర్సప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పడిలేస్తూ నాలుగో స్థానంలో నిలిచేందుకు పోటీపడ్డ మరో జట్టు ఓటమితో అర్హత సాధించగలిగింది. ఇదంతా లీగ్‌లో భాగం కాగా.. అచ్చివచ్చిన మైదానంగా పేరుపడ్డ వైఎస్‌ఆర్‌ స్టేడియంలో ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో ఎవరిది విజయమో తేలిపోనుంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయర్‌కు ఆడనుంది. ఆ మ్యాచ్‌కు విశాఖే ఆతిథ్యమివ్వనుంది.

లీగ్‌లో సమ ఉజ్జీలే..
12వ సీజన్‌లో లీగ్‌లో ఇరుజట్లు సముజ్జీగానే నిలిచాయి. తొలి రౌండ్‌లో సన్‌రైజర్స్‌ గెలవగా.. రెండో రౌండ్‌లో ఢిల్లీ విజయం సాధించి ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ఎవరి హోమ్‌ గ్రౌండ్‌లో వారే పరాజితులయ్యారు. తొలి రౌండ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ ఎనిమిది వికెట్లకు 129 పరుగులు చేయగా సన్‌రైజర్స్‌ ఐదే వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్నందుకుంది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనే హోమ్‌ టీమ్‌ ఓడింది. ఇక రెండో రౌండ్‌లో ఢిల్లీ 39 పరుగులతో విజయం సాధించింది. ఢిల్లీ ఏడు వికెట్లకు 171 పరుగులు చేయగా.. ప్రతిగా సన్‌రైజర్స్‌ 116 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లోని హోమ్‌ గ్రౌండ్‌లోనే ఈ పరాజయాన్ని చవిచూసింది. విశాఖ వైఎస్‌ఆర్‌ స్టేడియంలో ఎవరిది ఆధిక్యమో తేలడంతో పాటు గెలిచిన జట్టు క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌కు అర్హత సాధించనుంది.

వార్నర్‌ మెరుపులు.. కాసినో స్వింగ్‌ మిస్‌
అత్యధిక పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ జట్టు  సభ్యుడు డేవిడ్‌ వార్నర్, అత్యధిక వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్‌ కాసిసో రబడా ప్రపంప కప్‌ సన్నాహాల్లో భాగంగా తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. దీంతో వారి మెరుపులు విశాఖ వాసులు మిసయ్యారు. సన్‌రైజర్స్‌ తరఫున ఇన్నింగ్స్‌లోనే సెంచరీ దాటేసిన బేరిస్టో మాత్రమే విశాఖ క్రీడాభిమానులను అలరించనున్నాడు.

ప్లేఆఫ్‌కు ఢిల్లీ, సన్‌రైజర్స్‌ ఇలా..
ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్‌ జట్లు పద్దేనిమిదేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో ముంబయి ఇండియన్స్‌ తొలి స్థానం, చెన్నై రెండో స్థానంలోనూ నిలిచాయి. ఢిల్లీ జట్టు మూడో స్థానానికి పడిపోయి సన్‌రైజర్స్‌తో ఎలిమినేషన్‌ ఆడేందుకు విశాఖ వచ్చింది. సన్‌రైజర్స్, నైట్‌ రైడర్స్, కింగ్స్‌ ఎలెవెన్‌ జట్లు పన్నెండేసి పాయింట్లతో నిలిచినా కాస్త మెరుగైన రన్‌రేట్‌తో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించగలిగింది. ఇక నాకవుట్‌ మ్యాచ్‌లు విశాఖలో ఎలాంటి ఉత్కంఠ రేపుతాయో చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement