పొలార్డ్‌ ఫీల్డింగ్‌ ఫీట్‌.. తప్పిన ప్రమాదం | IPL 2019 Pollard Tries To Bring Football Skills Into Play In Sunrisers match | Sakshi
Sakshi News home page

పొలార్డ్‌ ఫీల్డింగ్‌ ఫీట్‌.. తప్పిన ప్రమాదం

Published Fri, May 3 2019 5:29 PM | Last Updated on Fri, May 3 2019 6:06 PM

IPL 2019 Pollard Tries To Bring Football Skills Into Play In Sunrisers match - Sakshi

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ ప్రతీ సీజన్‌లో తన వైవిధ్యమైన ఆటతో అభిమానులను అలరిస్తుంటాడు. చిరుతలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్‌తో పాటు కళ్లుచెదిరే రీతిలో క్యాచ్‌లు ఆందుకోవడంలో పొలార్డ్ దిట్ట. ఈ సీజన్‌లో ప్రారంభంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేశ్‌ రైనా ఇచ్చిన క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించాడు. ఇలా ప్రతీ సీజన్‌లో కనీసం ఒక్కటైన సూపర్‌ క్యాచ్‌ను అందుకోవడం చూస్తుంటాం. అయితే ఈ సారి మరింత కొత్తగా బంతిని ఆపడాని​కి ప్రయత్నించి విఫలమైన పొలార్డ్‌ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. 

గురువారం ముంబైతో మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ ఆటగాడు వృద్దిమాన్‌ సాహా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పొలార్డ్‌ మిడాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. సాహా మిడాన్‌ వైపుగా ఆడిన బంతిని వినూత్నంగా ఆపడానికి పొలార్డ్‌ ప్రయత్నించాడు. బంతిని వెంటాడిన అతడు బౌండరీ వద్ద ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల మాదిరిగా కాళ్లతో బంతిని వెనక్కి నెట్టాలని భావించాడు. కానీ బంతిని ఆపే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ తర్వాత వుండే బారికెడ్లను ఢీకొట్టి ప్రమాదకర రీతిలో అవతలికి పడిపోయాడు. అయితే ఈ ప్రమాదంలో అతడికి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డాడు. 

అయితే అతడు ఇంకాస్త పక్కన పడివుంటే తీవ్రంగా గాయపడేవాడు. సౌండ్ సిస్టంకు సంబంధంచిన భారీ పరికరాలకు కొద్దిగా పక్కన పడటంతో ప్రమాదం తప్పింది. పొలార్డ్ కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, యాజమాన్యంతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న మూడో జట్టుగా నిలిచింది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement