రైనా మొదలెట్టాడు.. ధోని ముగించాడు | IPL 2019 Raina And Dhoni Help CSK End at 179 Against Delhi | Sakshi
Sakshi News home page

రైనా మొదలెట్టాడు.. ధోని ముగించాడు

Published Wed, May 1 2019 9:58 PM | Last Updated on Wed, May 1 2019 10:20 PM

IPL 2019 Raina And Dhoni Help CSK End at 179 Against Delhi - Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సీఎస్‌కేకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన వాట్సన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రైనాతో కలిసి మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. డుప్లెసిస్‌ నెమ్మదిగా ఆడగా.. రైనా ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న తరుణంలో అక్షర్‌పటేల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి డుప్లెసిస్‌(39) ఔటయ్యాడు. 

డుప్లెసిస్‌ ఔటైన కొద్దిసేపటికి ఐపీఎల్‌ సీజన్‌లో 12లో రైనా రెండో వ్యక్తిగత అర్దసెంచరీ సాధించాడు. అనంతరం స్కోరుబోర్డు పెంచే క్రమంలో రైనా(59; 37 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్‌) కూడా నిష్క్రమించాడు. రైనా వెనుదిరిగిన తర్వాత అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 25 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటునే తనదైన రీతిలో ధోని రెచ్చిపోయాడు. ధోని(44 నాటౌట్‌; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో సుచిత్‌ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. మోరిస్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement