
హైదరాబాద్: ‘బాసిల్ థంపి’ ఈ పేరును సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోరు. చేతుల దాకా వచ్చిన విజయాన్ని తన ఒక్క ఓవర్‌తో ఈ సన్‌రైజర్స్ పేసర్ దూరం చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా థంపి వేసిన 18వ ఓవర్ అప్పటివరకు విజయం దిశగా సాగుతున్న సన్‌రైజర్స్ గతి మార్చింది. దీంతో థంపిని టార్గెట్ చేస్తూ సన్‌రైజర్స్ అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘నీకెవడ్రా బౌలింగ్ నేర్పింది’అంటూ ఓ అభిమాని మండిపడగా..‘నాకు బయటకనిపించు తాట తీస్తా’, ‘ఢిల్లీ గెలవలేదు.. థంపి ఓడించాడు’, ‘థంపి ఏం బౌలింగ్‌రా అది’అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పోస్ట్ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సన్‌రైజర్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి అదిరే ఆరంభం లభించినప్పటికీ.. ఖలీల్, రషీద్‌ఖాన్‌లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఢిల్లీని కష్టాల్లోకి నెట్టారు. చివర్లో మహ్మద్ నబి, భువనేశ్వర్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీకి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులో పంత్ మినహా బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో సన్‌రైజర్స్ శిబిరంలో ఆనందం మొదలైంది. ఈ దశలో సారథి విలియమ్సన్ ఖలీల్‌కు రెండు ఓవర్లు వేసే అవకాశం ఉన్నా థంపికి బంతిని అప్పగించాడు. థంపి వేసని ఆ ఓవరల్లో పంత్ రెచ్చిపోయాడు. వరుస బౌండరీలతో చెలరేగడంతో ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీకి చివరి రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులే అవసరమవడంతో సులువుగా విజయం సాధించింది. అయితే థంపికి కాకుండా ఖలీల్‌కు బౌలింగ్ అవకాశం ఇస్తే సమీకరణాలు వేరేగా ఉండేవని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో థంపిపై సన్‌రైజర్స్ అభిమానులు గరంగరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment