
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 కోసం అన్ని ఫ్రాంఛైజీలు తమ వేట మొదలుపెట్టాయి. గత సీజన్ అనుభవాలను, ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఆటగాళ్ల మార్పులు, కొత్త కొచింగ్ బృందాలను ఎంపిక చేయడంలో అన్నీ ఫ్రాంచైజీలు చాలా బిజీగా ఉన్నాయి. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు కొత్త హెడ్ కోచ్‌లను నియమించాయి. తాజాగా రాజస్తాన్ రాయల్స్ కూడా సోమవారం కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్ల పాటు మెక్‌డొనాల్డ్ కోచ్‌గా వ్యవహరిస్తారని రాజస్తాన్ రాయల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ బర్తాకూర్ తెలిపారు.
మెక్‌డొనాల్డ్‌కు ఐపీఎల్‌తో అనుబంధం ఉంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున ప్రాతినథ్యం వహించాడు. అనంతరం 2012-2013లో ఆర్సీబీకి బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనగేడ్స్, విక్టోరియా జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ కోచ్‌గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నానని, అదేవిధంగా తనముందున్న సవాళ్లు కూడా తెలుసని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. ఆలస్యం చేయకుండా ఐపీఎల్‌లో రాజస్తాన్‌ను చాంపియన్‌గా నిలపడం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు. అయితే ప్రధాన కోచ్ పదవి కోసం అనేకమంది దరఖాస్తు చేసుకన్నప్పటికీ మెక్‌డొనాల్డ్ ఆలోచనలు, ప్రణాళికలు నచ్చడంతోనే అతడిని ఎంపిక చేశామని రాజస్తాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ జుబిన్ బరాక్ తెలిపాడు.