న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో రాత్రి మ్యాచ్‌ల సమయాన్ని కాస్త ముందుగా జరపాలనే ప్రతిపాదనపై గవర్నింగ్ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు జరిగే ఐపీఎల్ టోర్నీలో ఎప్పటిలాగే రాత్రి మ్యాచ్‌లు 8 గంటల నుంచే ప్రారంభమవుతాయని ప్రకటించింది. మ్యాచ్‌లు నిర్ధారిత సమయానికి పూర్తి కాకుండా అర్ధరాత్రి వరకు కొనసాగుతుండటంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ఈ అంశంపై బీసీసీఐ సోమవారం సుదీర్ఘంగా చర్చించింది.
బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది. అయితే ఈసారి మొత్తం షెడ్యూల్‌లో రెండు మ్యాచ్‌లు జరిగే (సాయంత్రం 4 గం.; రాత్రి 8 గం.) రోజులను తగ్గించారు. వీటిని ఐదుకు మాత్రమే పరిమితం చేశారు. ఐపీఎల్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లంతా కలిసి సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ‘ఆల్ స్టార్స్ మ్యాచ్’ ఆడనున్నారు. మరోవైపు మార్చిలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కోసం జట్టును కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని ప్రకటించాడు.
‘నోబాల్’ అంపైర్లు కూడా: ఈసారి ఐపీఎల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న విధంగా ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’ను అనుమతించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అతని స్థానంలో రిఫరీ విచక్షణ మేరకు అదే తరహా ఆటగాడిని బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలనేదే ఈ నిబంధన. ఇక నోబాల్స్‌ను మాత్రమే చూసేందుకు ఒక టీవీ అంపైర్‌ను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. గత ఐపీఎల్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో ముంబై పేసర్ మలింగ వేసిన నోబాల్‌ను అంపైర్ గుర్తించకపోవడం వివాదానికి కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment