ముంబై: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ మెరిశారు. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై 15 పరుగులతో విజయం సాధించారు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని ముంబై పూర్తి ఓవర్లలో 158/4 స్కోరుకు కట్టడి చేసింది. పీటర్సన్ (44), మనోజ్ తివారి (41), డుమినీ (45 నాటౌట్) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై 19.3 ఓవర్లకు 173 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఆరంభంలో అద్భుతంగా ఆడినా చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సిమ్మన్స్, మైకేల్ హస్సీ జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చారు. సిమ్మన్స్ (35), హస్సీ (56) తొలి వికెట్కు 8 ఓవర్లలోనే 87 పరుగులు జోడించారు. సిమ్మన్స్ అవుటయినా హస్సీ.. రోహిత్ శర్మ (30)తో కలసి ఇదే జోరు కొనసాగించాడు. రన్రేట్ పదికి తగ్గకుండా పరుగులు సాధించారు. దీంతో ముంబై స్కోరు సునాయాసంగా 200 దాటడం ఖాయమనిపించింది. కాగా 15 వ ఓవర్లో ఢిల్లీ బౌలర్ ఉనాద్కట్ విజృంభించి ముంబై జోరును అడ్డుకున్నాడు. 140/2 స్కోరు వద్ద రోహిత్ను బౌల్డ్ చేసిన ఉనాద్కట్.. ఇదే ఓవర్లో పొలార్డ్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అంబటి రాయుడు, తరె, హర్భజన్, డి లాంగ్ పెవిలియన్కు క్యూ కట్టడంతో పరుగుల వేటలో ముంబై జోరు తగ్గింది. మరో మూడు బంతులు మిగిలుండగా ముంబై ఆలౌటైంది. ముంబై 33 పరుగుల తేడాతో చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దీంతో స్కోరు 180 కూడా దాటలేకపోయింది.
సొంతగడ్డపై మెరిసిన ముంబై
Published Fri, May 23 2014 7:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement