సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభానికి మరో నెల రోజుల సమయం ఉంది. అయితే టోర్నీ ప్రసారకర్త ‘స్టార్ స్పోర్ట్స్’ దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలను నగరంలో ప్రారంభించింది. బుధవారం శంకరపల్లిలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ ప్రత్యేక షో జరిగింది. ‘గేమ్ ప్లాన్ ఇన్ యువర్ సిటీ’ పేరుతో ఈ కార్యక్ర మం నిర్వహించారు. పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు దీపక్ హుడాతో పాటు మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఇందులో పాల్గొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులతో వీరంతా ఐపీఎల్‌కు సంబంధించి అనేక అంశాలపై చర్చించారు.
లీగ్ విశేషాలు, వారు మ్యాచ్‌లను అనుసరిస్తున్న తీరుకు సంబంధించిన వివిధ విశేషాలతో ఈ ఇష్టాగోష్టి కార్యక్రమం సాగింది. క్రికెటర్లతో ముచ్చటించిన విద్యార్థులు లీగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పలు ప్రశ్నలు సంధించగా...ముగ్గురు క్రికెటర్లు వారికి సమాధానమిచ్చారు. గేమ్ ప్లాన్ కార్యక్రమాన్ని స్టార్ దేశంలోని ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీ నగరాల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి షో హైదరాబాద్‌లో జరిగింది. ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్ జట్టు సభ్యులుగా ఉన్న తన్మయ్ అగర్వాల్, మెహదీ హసన్ కూడా విద్యార్థులతో క్రికెట్ ఆడి సరదాగా గడిపారు.
ఇదంతా ఐపీఎల్ పుణ్యమే...
భారత జట్టు యువ ఆటగాళ్లు ఇటీవల అద్భుతంగా రాణిస్తుండటంతో ఐపీఎల్ ముఖ్య పాత్ర పోషించిందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బుమ్రా, భువనేశ్వర్, పాండ్యాలు టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా మారడంలో లీగ్‌దే పాత్ర అని అన్నాడు. లీగ్ ఆరంభమైన కొత్తలో వన్డేల్లో ఆటనే టి20ల్లో ఆడే ప్రయత్నం చేశారని...అది తప్పని నిరూపిస్తూ ఐపీఎల్ అసలు సిసలు టి20 క్రికెట్‌ను చూపించిందని చోప్రా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ జట్లలో కొందరు మినహా ఎక్కువ మంది ఆటగాళ్లు మారిపోవడంతో 2018 సీజన్ కొత్తగా కనిపించడం ఖాయమన్న చోప్రా...సన్‌రైజర్స్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మరో వైపు శ్రీలంకలో జరిగే ముక్కోణపు టి20 సిరీస్‌లో మ్యాచ్ అవకాశం లభిస్తే తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తానని దీపక్ హుడా విశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment