
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఇకపై సరదా టోర్నీగా మాత్రమే చూడరాదని... ఇన్నేళ్లలో ఈ లీగ్ స్థాయి ఎంతో పెరిగిందని పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో బలమైన పోటీ, ఆటగాళ్ల ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి దృష్టి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్ వేలంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కనిపించిందని పఠాన్ అన్నాడు. ‘నేను 2008లో తొలి ఐపీఎల్ ఆడినప్పుడు దానిని దాదాపుగా అందరూ కేవలం వినోదంగా మాత్రమే చూశారు. గత కొన్నేళ్లుగా లీగ్ ప్రతీ సంవత్సరం మరింతగా ఎదిగిపోతోంది. ఇప్పుడు పది సీజన్లు ముగిశాక తిరుగులేని స్థితిలో, ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలలో ఒకటిగా నిలిచింది. ఈసారి వేలంపై అందరి దృష్టి నిలవడమే ఇందుకు ఉదాహరణ. క్రికెటర్లు కూడా తీవ్ర ఒత్తిడి మధ్య ఎలా ఆడాలో నేర్చుకుంటున్నారు. ఆటగాళ్లకు వేలంలో విలువ కట్టడం వల్ల కూడా కచ్చితంగా బాగా ఆడాలనే కసి, పట్టుదల వారికి పెరుగుతాయి. ఇదంతా లీగ్‌ను పెద్ద స్థానంలో నిలబెడుతోంది’ అని ఇర్ఫాన్ విశ్లేషించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించడం వల్ల రంజీ ట్రోఫీ కంటే ఐపీఎల్ ప్రదర్శన ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోందని అతను పేర్కొన్నాడు. మరోవైపు లీగ్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు పఠాన్ మరో సూచన చేశాడు. న్యూజిలాండ్‌లో ఉన్న తరహాలో మైదానంలో ప్రేక్షకులు క్యాచ్ పట్టే అవకాశం ఇచ్చి బహుమతులతో ప్రోత్సహించాలని అన్నాడు.
జమ్మూ కశ్మీర్ తరఫున...
2018 ఐపీఎల్ వేలంలో ఇర్ఫాన్‌ను ఏ జట్టు కూడా తీసుకోలేదు. అయితే దీనికి తాను బాధ పడటం లేదని, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఏమాత్రం రాణించకపోవడం వల్లే తనను పట్టించుకోలేదని విషయం తనకు తెలుసని అతను అన్నాడు. వచ్చే దేశవాళీ సీజన్‌లో ఇర్ఫాన్ పఠాన్ జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ సంఘం ప్రతినిధులతో తాను చర్చలు జరిపినట్లు అతను వెల్లడించాడు. ఈ సీజన్‌లలో ఆడిన 2 రంజీ మ్యాచ్‌లలో కూడా విఫలం కావడంతో ఇర్ఫాన్‌ను బరోడా అర్ధాంతరంగా జట్టు నుంచి తప్పించింది. కీలక సమయంలో గాయాలతో కెరీర్ ఇబ్బందుల్లో పడిందని, గణాంకాలకంటే కూడా ఒక దశలో అమిత ప్రభావం చూపించిన ఆటగాడిగా భారత క్రికెట్ తనను గుర్తు పెట్టుకుంటుందని ఉద్వేగంగా చెప్పాడు. ఈసారి ఐపీఎల్‌లో ‘స్టార్ టీవీ’ వ్యాఖ్యాతల బృందంలో చేరే అవకాశం ఉన్న ఇర్ఫాన్... సన్‌రైజర్స్ తరఫున తన సోదరుడు యూసుఫ్ పఠాన్ బాగా ఆడతాడనే విశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment