
'ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నాం'
న్యూఢిల్లీ: త్వరలో టీమిండియాతో జరుగనున్న ట్వంటీ 20 సిరీస్ పై దక్షిణాఫ్రికా ట్వంటీ 20 కెప్టెన్ డు ప్లెసిస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అక్టోబర్ రెండు నుంచి ఆరంభం కానున్న ట్వంటీ 20 సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టు సహజసిద్ధంగా ఆడుతుందన్నాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ఆడిన అనుభవం ఎక్కువని.. దాన్ని కచ్చితంగా ఉపయోగించుకుంటామన్నాడు. 'మా ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నారు. ట్వంటీ 20 సిరీస్ సందర్భంగా ఐపీఎల్ మాకు లాభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు'అని డు ప్లెసిస్ తెలిపాడు.
మూడు ఫార్మాట్‌లలో 72 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌తో 3 టి20లు, 5 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ నెల 29న సఫారీలు ఢిల్లీలో టి20 వార్మప్ మ్యాచ్ ఆడనుండగా... అక్టోబర్ 2న ధర్మశాలలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు డివిలియర్స్, టి20 జట్టుకు డు ప్లెసిస్, టెస్టు జట్టుకు ఆమ్లా సారథ్యం వహించనున్నారు.