ముంబై: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కేసుపై చర్చించేందుకు ఈ నెల 20న వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బోర్డు అధ్యక్ష పదవిలో తాను కొనసాగే అవకాశం ఇవ్వాలంటూ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ)తో సహా పలు అనుబంధ యూనిట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఎవరి సూచనల మేరకు న్యాయవాది బోర్డు తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారో తమకు తెలియడం లేదని, ఈ విషయమై చర్చించేందుకు వర్కింగ్ కమిటీని వెంటనే సమావేశ పరచాల్సిందిగా వారు ఆ లేఖలో కోరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో వర్కింగ్ కమిటీ సమావేశం జరపనున్నట్లు బోర్డు ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు.
‘ఎవరికీ ధైర్యం లేదు’
బీసీసీఐలో ఎన్.శ్రీనివాసన్‌ను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయిందని బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. స్పాట్‌ఫిక్సింగ్ వివాదం వెలుగులోకి వచ్చి ఏడాది గడిచినా అధ్యక్ష పదవిని వీడని శ్రీనివాసన్‌ను ఎవరూ ఏమీ చేయలేకపోయారని, చివరికి సుప్రీంకోర్టు తొలగించాల్సివచ్చిందని మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం జరగనున్న వర్కింగ్ కమిటీ సమావేశంలోనైనా శ్రీనివాసన్ అంశాన్ని ఎవరో ఒకరు లేవనెత్తాలని ఆయన కోరారు.
20న బీసీసీఐ అత్యవసర సమావేశం
Published Fri, Apr 18 2014 1:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement