IPL spot fixing case
-
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో మలుపు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు మరో మలుపు తిరిగింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 2013 ఐపీఎల్ సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, చవాన్‌లను ఇటీవల ఢిల్లీ ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. -
'నిర్దోషులుగా తేలడం సంతోషకరం'
కోల్‌కతా: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్లు నిర్దోషలుగా తేలడం సంతోషకరమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. శ్రీశాంత్ మళ్లీ టీమిండియాలోకి వస్తాడా అన్న ప్రశ్నకు గంగూలీ.. అతనిపై అభియోగాలను కోర్టు కొట్టేసిందని, బీసీసీఐకి అభ్యంతరం ఉండకపోవచ్చని సమాధానమిచ్చారు. కాగా కోర్టు తీర్పుపై స్పందించేందుకు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తిరస్కరించాడు. -
ప్రతిభ, వివాదాలకు కేరాఫ్ శ్రీ
ప్రతిభ, సంచలనాలు, వివాదాలు, విమర్శలు.. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రెస్ కేరళ పేసర్ శ్రీశాంత్. భారత క్రికెట్లోకి ఓ మెరుపులా వచ్చాడు. అనతికాలంలోనే టాప్ బౌలర్ల సరసన చేరాడు. టీమిండియాకు ఓ ప్రతిభావంతుడైన పేసర్ దొరికాడంటూ క్రీడాపండితులతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు, బౌలింగ్‌లో వాడి తగ్గడం, వివాదాలు, చివరకు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. కష్టకాలంలో స్నేహితురాలు భువనేశ్వరి అండగా నిలిచి శ్రీని పెళ్లి చేసుకుంది. ఈ మధ్యకాలంలో అతనికి సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో 32 ఏళ్ల శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 1983లో కేరళలో శ్రీశాంత్ జన్మించాడు. శ్రీ కుటుంబ సభ్యులకు సినీ రంగంతో సంబంధమున్నా.. అతను మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. పదేళ్ల క్రితం 2005 అక్టోబర్‌లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ మరుసటి సంవత్సరం టెస్టు క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. 53 వన్డేలాడిన శ్రీ 75 వికెట్లు పడగొట్టాడు. ఇక 27 టెస్టులాడి 87 వికెట్లు తీశాడు. కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ ఆరంభంలో శ్రీశాంత్ బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు రావడంతో బౌలింగ్‌లో పస తగ్గింది. ఇక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌తో గొడవ పడటం వివాదాస్పదంగా మారింది. భజ్జీ చెంపదెబ్బ కొట్టడంతో శ్రీ స్టేడియంలోనే భోరున ఏడ్చేశాడు. 2013లో శ్రీశాంత్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ కావడంతో కెరీర్‌ను అర్ధంతరంగా ఆపేయాల్సివచ్చింది. ఆ ఏడాది మే 13న ఢిల్లీ పోలీసులు ముంబైలో అతడ్ని అరెస్ట్ చేశారు. ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌తో సహా 16 మంది క్రికెటర్లపై అభియోగాలు వచ్చాయి. బీసీసీఐ శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. స్నేహితురాలు భువనేశ్వరిని పెళ్లి చేసుకన్న శ్రీశాంత్‌కు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు నిర్దోషిగా బయటపడటంతో మళ్లీ క్రికెట్లో వస్తానని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ కూడా అతనిపై నిషేధం తొలగించే అవకాశముంది కాబట్టి లైన్ క్లియర్ కావచ్చు. రెండేళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్న 32 ఏళ్ల శ్రీశాంత్ ఫిట్నెస్ సాధించి, మునుపటి ఫామ్ చాటుతానని చెబుతున్నాడు. -
దేవుడి దయతో మళ్లీ క్రికెట్ ఆడుతా: శ్రీశాంత్
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడినందుకు కేరళ పేసర్ శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఎవరిపైనా విమర్శలు, ఫిర్యాదు చేయదలచుకోలేదని, దేవుడి దయ వల్ల మళ్లీ క్రికెట్ ఆడుతానని శ్రీశాంత్ అన్నాడు. కోర్టు నిర్దోషిగా ప్రకటించగానే శ్రీశాంత్ సంతోషం పట్టలేక ఏడ్చేశాడు. ఈ విషయం విని తన కూతురు సంతోషిస్తుందని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు బోర్డు అనుమతిస్తుందని ఆశిస్తున్నానని, మళ్లీ ఫిట్నెస్ సాధిస్తానని చెప్పాడు. 'నాకు సినిమా చాన్స్‌లు వచ్చినా.. మొదటి ప్రాధాన్యం క్రికెట్‌కే. రేపు నేషనల్ స్టేడియానికి వెళును. నేను మళ్లీ పూర్తిగా ఫిట్నెస్ సాధించి, మునుపటి మాదిరి వాడిగా బౌలింగ్ చేస్తా. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన భార్య, కూతురు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని శ్రీశాంత్ అన్నాడు. -
స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లకు విముక్తి
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకత్ చవాన్లకు విముక్తి లభించింది. శనివారం ఢిల్లీ కోర్టు ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా నిందితులుగా ఉన్న మొత్తం 16 మంది క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఆటగాళ్లపై నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టేస్తూ జడ్జి నానా బన్సల్ తీర్పు వెలువరించారు. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్, చండీలా, చవాన్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్లకు బుకీలతో సంబంధాలున్నాయని, లంచాలు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు చేశారు. వీరితో పాటు రాజస్థాన్ క్రికెటర్లు అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది, హర్మీత్ సింగ్ తదితరులను నిందితులుగా చేర్చారు. క్రికెటర్లతో పాటు మొత్తం 42 మందిపై అభియోగాలు నమోదు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్, ఇబ్రహీం, చోటా షకీల్ పేర్లను కూడా ఢిల్లీ పోలీసులు చేర్చారు. బుకీలతో ఫోన్లలో మాట్లాడిన సంభాషణలను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బయటకురాగానే బీసీసీఐ నిందితులైన క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరిని నిషేధించింది. కాగా క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదిలావుండగా, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణకు సుప్రీం కోర్టు నియమించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా సారథ్యంలోని కమిటీ చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండేళ్ల కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్లు క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాలం వేటు వేసింది. రాజ్ కుంద్రా, మేయప్పన్ బెట్టింగ్‌కు పాల్పడినట్టు లోధా కమిటీ నిర్ధారించింది. -
20న బీసీసీఐ అత్యవసర సమావేశం
ముంబై: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కేసుపై చర్చించేందుకు ఈ నెల 20న వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బోర్డు అధ్యక్ష పదవిలో తాను కొనసాగే అవకాశం ఇవ్వాలంటూ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ)తో సహా పలు అనుబంధ యూనిట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎవరి సూచనల మేరకు న్యాయవాది బోర్డు తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారో తమకు తెలియడం లేదని, ఈ విషయమై చర్చించేందుకు వర్కింగ్ కమిటీని వెంటనే సమావేశ పరచాల్సిందిగా వారు ఆ లేఖలో కోరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో వర్కింగ్ కమిటీ సమావేశం జరపనున్నట్లు బోర్డు ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. ‘ఎవరికీ ధైర్యం లేదు’ బీసీసీఐలో ఎన్.శ్రీనివాసన్‌ను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయిందని బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. స్పాట్‌ఫిక్సింగ్ వివాదం వెలుగులోకి వచ్చి ఏడాది గడిచినా అధ్యక్ష పదవిని వీడని శ్రీనివాసన్‌ను ఎవరూ ఏమీ చేయలేకపోయారని, చివరికి సుప్రీంకోర్టు తొలగించాల్సివచ్చిందని మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం జరగనున్న వర్కింగ్ కమిటీ సమావేశంలోనైనా శ్రీనివాసన్ అంశాన్ని ఎవరో ఒకరు లేవనెత్తాలని ఆయన కోరారు.