స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లకు విముక్తి
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్తో పాటు అజిత్ చండీలా, అంకత్ చవాన్లకు విముక్తి లభించింది. శనివారం ఢిల్లీ కోర్టు ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా నిందితులుగా ఉన్న మొత్తం 16 మంది క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఆటగాళ్లపై నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టేస్తూ జడ్జి నానా బన్సల్ తీర్పు వెలువరించారు.
రెండేళ్ల క్రితం ఐపీఎల్ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్, చండీలా, చవాన్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్లకు బుకీలతో సంబంధాలున్నాయని, లంచాలు తీసుకుని ఫిక్సింగ్కు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు చేశారు. వీరితో పాటు రాజస్థాన్ క్రికెటర్లు అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది, హర్మీత్ సింగ్ తదితరులను నిందితులుగా చేర్చారు. క్రికెటర్లతో పాటు మొత్తం 42 మందిపై అభియోగాలు నమోదు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్, ఇబ్రహీం, చోటా షకీల్ పేర్లను కూడా ఢిల్లీ పోలీసులు చేర్చారు. బుకీలతో ఫోన్లలో మాట్లాడిన సంభాషణలను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు.
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బయటకురాగానే బీసీసీఐ నిందితులైన క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరిని నిషేధించింది. కాగా క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదిలావుండగా, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణకు సుప్రీం కోర్టు నియమించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా సారథ్యంలోని కమిటీ చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండేళ్ల కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్లు క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాలం వేటు వేసింది. రాజ్ కుంద్రా, మేయప్పన్ బెట్టింగ్కు పాల్పడినట్టు లోధా కమిటీ నిర్ధారించింది.