ప్రతిభ, వివాదాలకు కేరాఫ్ శ్రీ
ప్రతిభ, సంచలనాలు, వివాదాలు, విమర్శలు.. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రెస్ కేరళ పేసర్ శ్రీశాంత్. భారత క్రికెట్లోకి ఓ మెరుపులా వచ్చాడు. అనతికాలంలోనే టాప్ బౌలర్ల సరసన చేరాడు. టీమిండియాకు ఓ ప్రతిభావంతుడైన పేసర్ దొరికాడంటూ క్రీడాపండితులతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు, బౌలింగ్లో వాడి తగ్గడం, వివాదాలు, చివరకు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ కెరీర్ను అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. కష్టకాలంలో స్నేహితురాలు భువనేశ్వరి అండగా నిలిచి శ్రీని పెళ్లి చేసుకుంది. ఈ మధ్యకాలంలో అతనికి సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో 32 ఏళ్ల శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
1983లో కేరళలో శ్రీశాంత్ జన్మించాడు. శ్రీ కుటుంబ సభ్యులకు సినీ రంగంతో సంబంధమున్నా.. అతను మాత్రం క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. పదేళ్ల క్రితం 2005 అక్టోబర్లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ మరుసటి సంవత్సరం టెస్టు క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. 53 వన్డేలాడిన శ్రీ 75 వికెట్లు పడగొట్టాడు. ఇక 27 టెస్టులాడి 87 వికెట్లు తీశాడు. కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ ఆరంభంలో శ్రీశాంత్ బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు రావడంతో బౌలింగ్లో పస తగ్గింది. ఇక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్తో గొడవ పడటం వివాదాస్పదంగా మారింది. భజ్జీ చెంపదెబ్బ కొట్టడంతో శ్రీ స్టేడియంలోనే భోరున ఏడ్చేశాడు.
2013లో శ్రీశాంత్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ కావడంతో కెరీర్ను అర్ధంతరంగా ఆపేయాల్సివచ్చింది. ఆ ఏడాది మే 13న ఢిల్లీ పోలీసులు ముంబైలో అతడ్ని అరెస్ట్ చేశారు. ఐపీఎల్ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్తో సహా 16 మంది క్రికెటర్లపై అభియోగాలు వచ్చాయి. బీసీసీఐ శ్రీశాంత్పై జీవితకాలం నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి క్రికెట్కు పూర్తిగా దూరమయ్యాడు. స్నేహితురాలు భువనేశ్వరిని పెళ్లి చేసుకన్న శ్రీశాంత్కు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు నిర్దోషిగా బయటపడటంతో మళ్లీ క్రికెట్లో వస్తానని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ కూడా అతనిపై నిషేధం తొలగించే అవకాశముంది కాబట్టి లైన్ క్లియర్ కావచ్చు. రెండేళ్లు క్రికెట్కు దూరంగా ఉన్న 32 ఏళ్ల శ్రీశాంత్ ఫిట్నెస్ సాధించి, మునుపటి ఫామ్ చాటుతానని చెబుతున్నాడు.