సాక్షి ప్రత్యేక ప్రతినిధి
అటు భారత్‌లో సుప్రీం కోర్టు ప్రతిపాద నలు బయటకు రాగానే ఇక్కడ ఢాకాలో భారత జట్టు ఉలిక్కిపడింది. మీడియా అప్రమత్తమైంది. దీంతో రోజంతా హైడ్రామా నడిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఐదుగురు ఆటగాళ్లు (ధోని, రైనా, జడేజా, అశ్విన్, మోహిత్) ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఢాకాలో ఉన్నారు.
అలాగే రాజస్థాన్ జట్టుకు చెందిన ఇద్దరు (రహానే, స్టువర్ట్ బిన్నీ) కూడా జట్టులో ఉన్నారు. మొత్తం 15 మంది భారత క్రికెటర్లలో ఏడుగురు ఈ రెండు జట్లకు చెందిన వాళ్లే కావడంతో వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. ముఖ్యంగా ధోని పాత్ర గురించి చాలా ఎక్కువగా చర్చ జరిగింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రావలసిన ధోని... మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలను తప్పించుకోవాలని భావించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఎవరో ఒక ఆటగాడు కచ్చితంగా మీడియా ముందుకు రావాలి. దీంతో రోహిత్ శర్మను పంపించారు. ‘భారత్‌లో ఏం జరుగుతుందనే అంశం మీద రోహిత్ మాట్లాడడు. కేవలం టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన అంశాలను మాత్రమే అడగాలి’ అని మీడియా సమావేశానికి ముందే భారత జట్టు మీడియా మేనేజర్ బాబా ప్రకటించారు. దీంతో మీడియాకు, ఆయనకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. మొత్తం మీద రోహిత్ ఈ ప్రశ్నల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అసలు గొడవ మొదలైంది. బాబాతో మీడియా ప్రతినిధులు కొందరు వాగ్వాదానికి దిగారు. ‘బీసీసీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. కానీ నేను ఐపీఎల్‌కు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలను అనుమతించను’ అని బాబా కుండబద్దలు కొట్టారు.
ఈసారీ కసి పెరుగుతుందా?
బోర్డుకు సంబంధించిన గొడవలు, వివాదాల మధ్య క్రికెట్ ఆడటం భారత్‌కు కొత్తేమీ కాదు. గత ఏడాది ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం బయటకు రాగానే భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది. ఆ టోర్నీలో అంచనాలకు మించి రాణించి చాంపియన్‌గా అవతరించింది. సాధారణంగా వివాదాలతో పాటే ఎప్పుడూ ప్రయాణించే భారత జట్టు ఈసారి బంగ్లాదేశ్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా పది రోజులు గడిపింది. ఈ లోగా సుప్రీం కోర్టు ప్రతిపాదనలతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ దుమారం నుంచి అభిమానుల గాలి మళ్లాలంటే భారత్ ఈసారి కూడా కప్ గెలవాలి. ఇదే కసితో ఆటగాళ్లు ఆడతారేమో..!
ఢాకాలో హైడ్రామా!
Published Fri, Mar 28 2014 4:04 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement