
సాక్షి, ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 లో రికార్డుల పర్వం తుది దశకు చేరుకుంది. తాజాగా ఐపీఎల్ వేదికగా మరో అరుదైన రికార్డు నమోదయింది. ఈ సారి ఏ బ్యాట్స్‌మనో, బౌలరో కాదు.. వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ హాట్‌స్టార్ ఓ రికార్డు సృష్టించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ ఒంటి చేత్తొ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే విజయం కోసం ఇరు జట్ల మధ్య సాగిన హోరాహోరీ పోరును రికార్డు స్థాయిలో అభిమానులు హాట్‌స్టార్‌లో వీక్షించారు.
ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌ను ఏకంగా 8.26 మిలియన్ల మంది హాట్‌స్టార్ లైవ్ ద్వారా ఆస్వాదించారంట. ఈ విషయాన్ని సీఈఓ అజిత్ మోహన్ తెలియజేశారు. గతంలో హాట్‌స్టార్ ద్వారా 7 మిలియన్ల వ్యూస్ మాత్రమే గరిష్టమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు యూట్యూబ్ లైవ్ ద్వారా 80 లక్షల మంది ఓ కార్యక్రమాన్ని వీక్షించారు. ఇప్పుడు సన్‌రైజర్స్.. సీఎస్‌కే మ్యాచ్‌తో ఆ రికార్డును హాట్‌స్టార్ తిరగరాసింది.