ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు రేపు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో మంగళవారం తీర్పు వెలువడనుంది. సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పును ఖరారు చేయనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై, రాజస్థాన్ భవితవ్యం తేలనుంది.
2013 ఐపీఎల్ సీజన్ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో మేయప్పన్, రాజ్కుంద్రాపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారించడానికి జనవరిలో సుప్రీం కోర్టు.. మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర లోధా సారథ్యంలో కమిటీని నియమించింది. రాజ్కుంద్రా, మేయప్పన్లు బెట్టింగ్కు పాల్పడ్డారని తేలినట్టు సమాచారం. చెన్నై, రాజస్థాన్ జట్లను నిషేధించవచ్చని లేదా ఈ రెండు జట్లకు భారీ జరిమానా విధించవచ్చని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.