'మహిళా క్రికెట్ కీ ఐపీఎల్ తరహా టోర్నమెంట్ లు అవసరం'
న్యూఢిల్లీ:భారత్ లో మహిళా క్రికెట్ మరింత వెలుగులోకి రావడానికి ఐపీఎల్ తరహా టోర్నమెంట్ ఉంటే మరింత లబ్ధి చేకూరుతుందని మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఈ తరహా టోర్నమెంట్లు వల్ల మరింత ప్రతిభావంతులైన క్రీడాకారిణులు సత్తా చాటుకునేందుకు ఆస్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి టోర్నమెంట్ ను ప్రవేశపెడితే అది ఒక దేశానికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారిణులకు వెలుగులోకి వచ్చే ఆస్కారం లభిస్తుందన్నారు. భారత క్రికెట్ కు ప్రాతినిధ్య వహిస్తున్న ఓ క్రీడాకారిణిగా తాను ఈ విషయాన్ని క్రికెట్ పెద్దలకు విన్నవిస్తున్నానని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆటలకున్న ప్రాధాన్యతను బట్టి ఆలోచిస్తే లీగ్ మ్యాచ్ టోర్నీలు విజయవంతమైయ్యాయన్న సంగతిని ఆమె గుర్తు చేశారు. ప్రతీ ఆటలోనూ ఇప్పటివరకూ పలురకాలైన లీగ్ లు ఆకట్టుకుంటూనే ఉన్నాయన్నారు. భారత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందన్నారు. ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా ఆయన తరువాతేనని అంజుమ్ తెలిపారు.