
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే ఓ సంచలనం. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో లీగ్‌లకు అంకుర సంస్థ ఐపీఎల్. ప్రపంచ వ్యాప్తంగా మరెన్నో ఆకర్షణలకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులకు చిరునామా ఈ లీగ్. అందుకేనేమో లీగ్‌లో సిక్సర్లు ఎగిసినంత ఎత్తుగా ‘బ్రాండ్’ విలువ కూడా పెరుగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ వ్యవస్థ మొత్తం విలువెంతో తెలుసా... 6.3 బిలియన్ అమెరికా డాలర్లు. మన కరెన్సీలో అక్షరాలా 43 వేల కోట్ల రూపాయలు. ఒక్క ఏడాదిలోనే ఒక బిలియన్ డాలర్లు అంటే రూ. 6,866 కోట్లు పెరిగిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రముఖ అంతర్జాతీయ విలువ గణన కంపెనీ ‘డఫ్ అండ్ ఫెల్ప్స్’ తాజా నివేదికలో ఈ అంశాల్ని వెల్లడించింది.
మొత్తం ఎనిమిది జట్లలో ముంబై ఇండియన్సే అత్యధిక విలువైన ఫ్రాంచైజీ. ముంబై బ్రాండ్ వ్యాల్యూ 113 మిలియన్ డాలర్లు (రూ. 6955 కోట్లు). బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ విలువ 104 మిలియన్ డాలర్లు (రూ.6867 కోట్లు). అత్యధిక మొత్తంతో బ్రాడ్ కాస్టింగ్ డీల్ కుదుర్చుకున్న స్టార్ స్పోర్ట్స్ ఒక విధంగా ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదం చేసింది. కేవలం ఇంగ్లిష్ వ్యాఖ్యానానికే పరిమితం కాకుండా 8 భారతీయ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని జోడించడం ద్వారా అనూహ్యంగా టీవీ ప్రేక్షకుల్ని పెంచేసింది. దీంతో ప్రేక్షకాదరణతో ప్రకటనలు, ఆదాయం ఇలా ఒకదానితో ఒకటి కలిసి ఐపీఎల్ బ్రాండ్ బాజాను మోగించినట్లు ‘డఫ్ అండ్ ఫెల్ప్స్’ తన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment