ఏసెస్‌కు రాయల్స్ షాక్ | IPTL: Novak Djokovic takes on Roger Federer in table topping clash | Sakshi
Sakshi News home page

ఏసెస్‌కు రాయల్స్ షాక్

Published Tue, Dec 9 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

ఏసెస్‌కు రాయల్స్ షాక్

ఏసెస్‌కు రాయల్స్ షాక్

మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా-ఫెడరర్ జంట ఓటమి
- అలరించిన జొకోవిచ్
- ఐపీటీఎల్

న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఇండియన్ ఏసెస్ జట్టు దూకుడుకు పగ్గాలు వేయడంలో యూఏఈ రాయల్స్ జట్టు సఫలమైంది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యూఏఈ రాయల్స్ జట్టు 29-22 పాయింట్ల తేడాతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సభ్యుడిగా ఉన్న ఇండియన్ ఏసెస్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ దశ పోటీలు ముగిశాయి.

ఇక ఈ లీగ్‌లో చివరిదైన నాలుగో అంచె పోటీలు ఈనెల 11 నుంచి 13 వరకు దుబాయ్‌లో జరుగుతాయి. ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 30 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 27 పాయింట్లతో యూఏఈ రాయల్స్, మనీలా మావెరిక్స్ ఉమ్మడిగా రెండో స్థానంలో; 17 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ మూడో స్థానంలో ఉన్నాయి.
 
మహిళల సింగిల్స్‌గా జరిగిన తొలి మ్యాచ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్ 6-5తో అనా ఇవనోవిచ్‌ను ఓడించి యూఏఈ రాయల్స్‌కు శుభారంభాన్ని ఇచ్చింది. రెండో మ్యాచ్‌గా జరిగిన లెజెండ్స్ సింగిల్స్‌లో గొరాన్ ఇవానిసెవిచ్ 6-3తో ఫాబ్రిస్ సాంతోరోపై గెలిచి రాయల్స్‌కు రెండో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత సంప్రాస్ బరిలోకి దిగినా స్కోరు 1-4 వద్ద ఉన్నపుడు అతను వైదొలిగాడు. సంప్రాస్ స్థానంలో సాంతోరో సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫెడరర్-సానియా మీర్జా ద్వయం 2-6 తేడాతో నెనాద్ జిమోనిచ్-మ్లాడెనోవిచ్ చేతిలో ఓటమి పాలైంది. ఇక నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఫెడరర్-మోన్‌ఫిల్స్ జంట 6-5తో జిమోనిచ్-జొకోవిచ్ జోడీపై గెలిచింది.
 
అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫెడరర్, జొకోవిచ్‌ల మధ్య జరిగిన చివరిదైన పురుషుల సింగిల్స్ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. పదునైన ఏస్‌లు, సుదీర్ఘ ర్యాలీలు, చురుకైన కదలికలతో ఈ ఇద్దరు మేటి ఆటగాళ్లు అభిమానులను అలరించారు. స్కోరు 5-5తో సమం కావడంతో ఐపీటీఎల్ నిబంధనల ప్రకారం ఐదు నిమిషాల షూటౌట్‌ను నిర్వహించారు. ఈ షూటౌట్‌లో ఫెడరర్ గెలిచాడు. అయితే వీరిద్దరి మధ్యే మరో గేమ్‌ను నిర్వహించగా.. ఈ గేమ్‌లో జొకోవిచ్ నెగ్గాడు. దాంతో ఈ ఇద్దరి మ్యాచ్ 6-6తో సమంగా ముగిసింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో మనీలా మావెరిక్స్ జట్టు 23-17తో సింగపూర్ స్లామర్స్‌పై గెలిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement