
నాగపూర్: లోయరార్డర్ బ్యాట్స్‌మన్ అక్షయ్ కర్నేవర్ (133 బంతుల్లో 102; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి ఫస్ట్‌క్లాస్ శతకం బాదడంతో రంజీ చాంపియన్ విదర్భ... ఇరానీ కప్‌పై పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియాతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో గురువారం ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌటైంది. దీంతో కీలకమైన 95 పరుగుల ఆధిక్యం కూడగట్టుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 245/6తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భను వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (139 బంతుల్లో 73; 14 ఫోర్లు), కర్నేవర్ ముందుకు నడిపించారు. క్రితం రోజు స్కోరుకు 23 పరుగులు జోడించి వాడ్కర్ వెనుదిరిగాడు. అయితే, అక్షయ్ వాఖరే (20), రజనీశ్ గుర్బానీ (28 నాటౌట్) అండతో కర్నేవర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
చివరి మూడు వికెట్లకు విదర్భ 115 పరుగులు జోడించడంతో స్కోరు 400 దాటింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ జట్టు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (27), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (6) త్వరగానే వెనుదిరిగారు. ఆదిత్య సర్వతే (1/51), అక్షయ్ వాఖరే (1/13) చెరో వికెట్ తీయగా... వన్ డౌన్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (85 బంతుల్లో 40 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అజింక్య రహానే (65 బంతుల్లో 25 బ్యాటింగ్, 1 ఫోర్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా చూశారు. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 7 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. నాలుగో రోజు శుక్రవారం విహారి, రహానేతో పాటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఏ మేరకు నిలుస్తారనే దానిపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment