తేలికేం కాదు! | irst ODI in Dharamsala today | Sakshi
Sakshi News home page

తేలికేం కాదు!

Published Sun, Dec 10 2017 1:22 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

irst ODI in Dharamsala today - Sakshi

శ్రీలంక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఢిల్లీ కాదు. మాస్కుల అవసరం కూడా లేదు. చక్కగా కునుకూ తీయొచ్చు. ఎందుకంటే విరాట్‌ కోహ్లి విశ్రాంతిలో  ఉన్నాడు కాబట్టి. అతనుంటే ఇంకెంత వీర బాదుడు బాదుతాడో, ఇంకెన్ని రికార్డులు చెరిపేస్తాడోననే బెంగ ఉండేది. దీంతో లంక ఇప్పుడు కాస్త ఉపశమనంతో... కలిసి రావాలనే అదృష్టంతో బరిలోకి దిగొచ్చు.  

ధర్మశాల:కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ వన్డే సిరీస్‌ను తాజాగా మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు కోహ్లి లేని జట్టుపై తేల్చుకునేందుకు శ్రీలంక ఉత్సాహంగా కదంతొక్కుతోంది. పైగా చివరి టెస్టులో కనబరిచిన పోరాటపటిమ కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఈనేపథ్యంలో భారత్‌కు మూడు వన్డేల సిరీస్‌ కైవసం అంత సులభం కాకపోవచ్చు. మొత్తానికి ఆదివారం ఆసక్తికర మ్యాచ్‌కు తెరలేవనుంది. ఇది డే నైట్‌ మ్యాచ్‌ అయినప్పటికీ రాత్రి మంచు ప్రభావం వల్ల రెండు గంటలు ముందుగా ఆటను ప్రారంభిస్తున్నారు.
 
రహానే ఫామ్‌లోకి వస్తాడా?
తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారత సారథ్యం కొత్త కావొచ్చు. కానీ ఐపీఎల్‌లో అతనొక విజయవంతమైన సారథి. గతంలో జట్టును నడిపించిన సామర్థ్యం ఉన్న అతను ఈ సిరీస్‌లో శుభారంభంతో తన అంతర్జాతీయ కెప్టెన్సీకి గొప్ప ఆరంభమివ్వాలని ఆశిస్తున్నాడు. పైగా ధోని అండదండలు సరేసరి. ఇక ఎప్పటిలాగే టీమిండియా బలం బ్యాటింగే. కానీ కీలకమైన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రహానే ఫామ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. ఓపెనర్లు ధావన్, రోహిత్‌ శర్మ అందించిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచాలంటే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెనే కీలకం. ఈ నేపథ్యంలో రహానే ఫామ్‌లోకి రావాలని జట్టు బలం గా కోరుకుంటోంది. శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండేలతో పాటు పడుతూ లేస్తూ సాగుతున్న దినేశ్‌ కార్తీక్‌కు ఈ సిరీస్‌ చక్కని చాన్స్‌. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే 2019 ప్రపంచకప్‌ పరిశీలన కోసమైన టచ్‌లో ఉంటారు. ఈ కుర్రాళ్లతో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అనుభవజ్ఞుడైన ధోనిలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది.

 బుమ్రా, భువీలను తట్టుకోగలరా?
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత పేస్‌ ద్వయం జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ల జోరు కొనసాగుతోంది. డెత్‌ ఓవర్లలో వీరిద్దరి జోడీ  అత్యంత ప్రమాదకరం. పిచ్‌ నుంచి ఏమాత్రం సహకారం లభించినా... ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను విడిచిపెట్టరు. కోహ్లి ఏడు వన్డే సిరీస్‌లు గెలిచాడంటే అందులో వీరిద్దరి పాత్ర ఎంతో ఉంది. అలాంటి పేస్‌ పదును ఉన్న ద్వయాన్ని లంక ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. స్పిన్‌లో చహల్, కుల్దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్‌లు మిడిల్‌ ఓవర్లను కట్టిపడేసే సమర్థులు.

 పరాజయాల వరుస మారేనా?
శ్రీలంక గత చివరి టెస్టులో పోరాడింది. ‘డ్రా’తో గట్టెక్కింది. కానీ..! వన్డేల్లో ఎన్నడూ లేని విధంగా పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ ఏడాదైతే ఏకంగా మూడు సిరీస్‌ల్లో 0–5తో వైట్‌వాష్‌ అయింది. టీమిండియాతోనూ క్లీన్‌స్వీప్‌ అయిన చెత్త రికార్డే లంకను వెంటాడుతోంది. గత 12 మ్యాచ్‌లు ఓడిన ఈ జట్టు ఏడు సిరీస్‌లు గెలుచుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్‌ జట్టును ఎలా ఎదుర్కొంటుందో మరి. ఇంతటి చెత్త రికార్డు ఉన్న శ్రీలంక ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను ఓడించింది. ఇదొక్కటే లంకవైపున్న ఆశాజనక ఫలితం. మూడో టెస్టులో కండరాల నొప్పితో బాధపడ్డ ధనంజయ డిసిల్వా ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటు లో లేడు. మిగతా హిట్టర్లు మాథ్యూస్, తరంగ, తిరిమన్నె, డిక్‌వెలాపై జట్టు బ్యాటింగ్‌ ఆధారపడింది. బౌలింగ్‌లో లక్మల్‌ భారత పరిస్థితులకు అలవాటు పడ్డాడు. నువాన్‌ ప్రదీప్, అకిల ధనంజయలు రాణిస్తేనే లంక నిలబడేందుకు అవకాశముంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఇక్కడ టాస్‌ కీలకమవుతుంది.  

గాయంతో కేదార్‌ అవుట్‌
తొడ కండరాల గాయంతో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు వన్డే జట్టులో చోటు లభించింది.

క్లీన్‌స్వీప్‌ చేస్తే టాప్‌ ర్యాంక్‌
టీమిండియా ఈ మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంక్‌కు ఎగబాకుతుంది. ఇప్పటికే టెస్టుల్లోనూ అగ్రస్థానంలో ఉన్న భారత్‌... వన్డేల్లోనూ ఆ చాన్స్‌ దక్కించుకుంటుంది. దీంతో కీలకమైన దక్షిణాఫ్రికా టూర్‌కు టాప్‌ ర్యాంక్‌తో పయనమవుతుంది. నిజానికి నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే కేవలం ఒక పాయింట్‌ తేడాతో రెండో స్థానంలో ఉన్న భారత్‌ ఈ ధర్మశాల వన్డే గెలిస్తే చాలు అగ్రస్థానానికి చేరుతుంది. అది స్థిరంగా కొనసాగాలంటే మాత్రం తదుపరి వన్డేల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్‌ వన్డే సిరీస్‌ను 2–1తో గెలిస్తే రెండో స్థానంలోనే ఉంటుంది.

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రహానే, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్‌/అక్షర్‌ పటేల్, బుమ్రా, చహల్‌.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), తరంగ, గుణతిలక, సమరవిక్రమ/కుశాల్‌ పెరీరా/తిరిమన్నె, డిక్‌వెలా, మాథ్యూస్, గుణరత్నే, చతురంగ/సచిత్‌/చమీర, లక్మల్, ప్రదీప్, అకిల ధనంజయ.

పిచ్, వాతావరణం
పిచ్‌ స్వభావాన్ని అంచనా వేయలేం. ఎందుకంటే గత మూడు వన్డేల స్కోర్లను పరిశీలిస్తే 190 నుంచి 330 మధ్య వచ్చాయి. లంక కెప్టెన్‌ తిసారా పెరీరా మాత్రం బ్యాటింగ్‌ వికెట్‌గా విశ్వసిస్తున్నాడు. నేడు వర్షసూచన లేకపోయినా... మేఘావృతమై ఉంటుంది. శీతాకాలం కాబట్టి ఇక్కడ మంచు ప్రభావం మరింత ఎక్కువ! 

కుర్రాళ్లకు ఈ సిరీస్‌ చక్కని అవకాశం. శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండేలు తుదిజట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే ఈ సిరీస్‌లో నిలకడ చూపెట్టాలి. దినేశ్‌ కార్తీక్‌ కూడా అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే మిడిలార్డర్‌లో విపరీతమైన పోటీనెలకొంది. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎవరిపైనా లేనిపోని ఒత్తిడి తీసుకురాదు. కుర్రాళ్లకు పేసర్‌ బుమ్రా ఆటే ఓ పాఠం. జట్టు తన నుంచి ఏం కోరుకుంటుందో అదే చేస్తాడు. అందువల్లే టెస్టు జట్టులోకి వచ్చాడు.   
 – రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌

రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి లేకపోయినా... భారత జట్టు తక్కువేం కాదు. మేం మాత్రం మా శక్తిమేర రాణించేందుకు బరిలోకి దిగుతాం. ఆల్‌రౌండర్‌ మాథ్యూస్‌ ఈ సిరీస్‌లో బంతితోనూ మాకు అండగా నిలవాలనుకుంటున్నాం. టెస్టుల్లో బౌలింగ్‌కు దిగని అతను బంతితో వన్డేల్లో సత్తా చాటాలని ఆశిస్తున్నాం. చివరి టెస్టులో గట్టెక్కించిన ధనంజయ నేటి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అయితే హిట్టర్లు డిక్‌వెలా, ధనుష్క, తరంగలపై ఆశలు పెట్టుకున్నాం.   
 –పెరీరా, శ్రీలంక కెప్టెన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement