మాకు సంబంధం లేని విషయం: విజయ్ గోయెల్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను సుప్రీం కోర్టు తొలగించడంపై స్పందించేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ నిరాకరించారు. ఈ కేసులో తమకెలాంటి పాత్ర లేదని తేల్చారు. ‘సుప్రీం కోర్టు, బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్ అంశంలో క్రీడా శాఖ పాత్ర ఏమీ లేదు.
ఈకేసులో మా భాగస్వామ్యం లేదు. లోధా కమిటీ నిర్ణయాలతోనూ మాకు సంబంధం లేదు. ఇక స్పందించడానికి ఏముంటుంది’ అని తేల్చారు. మరోవైపు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌ను మరింత మెరుగుపర్చేందుకు క్రీడా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం.