Minister Vijay Goel
-
క్రీడలకు మరింత ప్రోత్సాహం
కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడలకు మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ అన్నారు. ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌తో పాటు శ్రీకాంత్‌ను గురువారం ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్ గోయల్ మాట్లాడుతూ... దేశంలో క్రికెట్ స్థాయిలో బ్యాడ్మింటన్‌కు గుర్తింపు రావడానికి సైనా, సింధులే ప్రధాన కారణమని కొనియాడారు. తమ ఆటతీరుతో కోట్లాది మంది మనుసులు గెలుచుకున్న వీరు మహిళలు క్రీడలపై దృష్టి సారించడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా వీరిని తీర్చిదిద్దిన కోచ్ గోపీచంద్, విమల్‌కుమార్‌లను ఆయన అభినందించారు. క్రీడల గురించి ఆలోచించిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీయే అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ప్రధాని వాకబు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంతో అంతర్జాతీయ టోర్నీల్లో మరింతగా రాణిస్తామని సైనా, సింధు పేర్కొన్నారు. -
పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇంతే!
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఊతమిచ్చినంత కాలం ఆ దేశంతో క్రీడా సంబంధాలు ఉండవని భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. తమ జట్లకు భారత హై కమిషన్ కావాలనే వీసాలు మంజూరు చేయడం లేదని పాకిస్తాన్ రెజ్లింగ్ సమాఖ్య మంగళవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన జాతీయ యూత్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గోయల్ పాక్ విషయంలో తమ వైఖరిని వెల్లడించారు. ‘దేశవిద్రోహ చర్యల్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టినిల్లు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. భారత సరిహద్దుల్లో పాక్ దౌర్జన్యాలు ఆపేవరకు మేం ఇలాగే మొండిగా ఉంటాం. ఉగ్రవాదానికి సహకరించినంత కాలం ఆదేశంతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు. మేం ఇలా చేయడం ద్వారా అక్కడి క్రీడాసంఘాలు వారి ప్రభుత్వంపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒత్తిడి పెంచుతాయి’ అని గోయల్ వివరించారు. మే 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే పాక్ రెజ్లింగ్ జట్లకు భారత హైకమిషన్ వీసాలు నిరాకరించడంతో ఆ జట్టు టోర్నీలో పాల్గొనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అంతకుముందు పాక్ స్క్వాష్ జట్లతో పాటు, గతేడాది పాకిస్తాన్ జూనియర్ హాకీ జట్టుకు కూడా భారత్ వీసాలు మంజూరు చేయలేదు. -
డోపింగ్ పాల్పడితే ఇక జైలే
కొత్త చట్టం చేసే దిశగా కేంద్ర క్రీడాశాఖ న్యూఢిల్లీ: డోపింగ్‌కు పాల్పడ్డవారికి జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకురావాలని భారత క్రీడామంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కోసం జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఒక సమావేశం ఏర్పాటుచేసి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ కూడా పాల్గొన్నారు. ‘ఇంతకుముందు జాతీయ స్థాయిలో ఉన్న డోపింగ్ సమస్య ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, పాఠశాల స్థాయిలకు కూడా చేరడం ఎంతో బాధిస్తోంది. డోపింగ్‌ను క్రిమినల్ చర్యగా భావించి వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నాం. జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆటగాళ్లే కాక డోపింగ్ విషయంలో భాగస్వాములైన కోచ్‌లు, ట్రైనర్లు, డాక్టర్లను కూడా శిక్షించేలా చర్యలు తీసుకుంటాము’ అని గోయల్ ప్రకటించారు. ఆటగాళ్లు ఉపయోగించేందుకు అనువుగా ఉండే డ్రగ్ కంపెనీల పేర్లను వాడా ప్రకటిస్తే బాగుంటుందని గోయల్ అభిప్రాయపడ్డారు. కోచి స్టేడియాన్ని తనిఖీ చేయనున్న గోయల్ వచ్చే అక్టోబర్‌లో సొంతగడ్డపై జరుగనున్న ఫిఫా అండర్–17 ప్రపంచకప్ ఏర్పాట్లపై కేంద్రం దృష్టిపెడుతోంది. ఈక్రమంలో ప్రపంచకప్ వేదికైన శుక్రవారం కేరళలోని కోచిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ తనిఖీ చేయనున్నారు. ఈనెల ప్రారంభంలోనే ఫిఫా కమిటీ కోచి స్టేడియంపై సమీక్షించింది. మే 15 లోగా స్టేడియంలోని ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. గడుపు సమీపిస్తున్న వేళ ఏర్పాట్లను పరిశీలించడానికి గోయల్ కోచి రానున్నారు. అలాగే కోచిలోని సాయ్ కార్యకలపాలపైనా సమీక్ష సమావేశాన్ని గోయల్ నిర్వహించనున్నట్లు క్రీడా మంతిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కోచి స్టేడియాన్ని తనిఖీ చేసిన అనంతరం టోర్నీ మిగతా ఐదు వేదికలను కూడా సందర్శించనున్నట్లు పేర్కొంది. గతనెలలో ఫిఫా తనిఖీ బృందం స్థానిక జవహర్లాల్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మే 15లోగా పనులన్నీ పూర్తి చేయాలని నిర్వాహకులకు తుది గడువు విధించింది. -
అథ్లెటిక్స్‌లో విదేశీ కోచ్‌లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటేందుకు అథ్లెటిక్స్ విభాగంలో విదేశీ కోచ్‌ల నియామకానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రేస్‌వాకింగ్, 400మీ. పరుగు, 400మీ.రిలే విభాగాలకు విదేశీ కోచ్‌లతో పాటు సహాయక సిబ్బందిని నియమించారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవ్ స్మిత్ రేస్ వాకింగ్ ఈవెంట్‌కు, గలీనా పి బుఖరీనా (అమెరికా) 400మీ. పరుగు విభాగాలకు కోచ్‌లుగా వ్యవహరిస్తారు. -
అంధ క్రికెటర్లకు రూ. 5 లక్షల నజరానా
న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులకు కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ నజరానా ప్రకటించారు. ఒక్కో ఆటగాడికి రూ. 5 లక్షల చొప్పున అందజేస్తామని గోయెల్ ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన గ్రామీణ్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రపంచకప్ సాధించిపెట్టిన ఆటగాళ్లందరికి రూ. 5 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తాం’ అని అన్నారు. గ్రామీణ్ ఖేల్ మహోత్సవ్‌లాంటి ఈవెంట్ల వల్ల మారుమూల పల్లెల్లోని ప్రతిభావంతులకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. -
మాకు సంబంధం లేని విషయం: విజయ్ గోయెల్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను సుప్రీం కోర్టు తొలగించడంపై స్పందించేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ నిరాకరించారు. ఈ కేసులో తమకెలాంటి పాత్ర లేదని తేల్చారు. ‘సుప్రీం కోర్టు, బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్ అంశంలో క్రీడా శాఖ పాత్ర ఏమీ లేదు. ఈకేసులో మా భాగస్వామ్యం లేదు. లోధా కమిటీ నిర్ణయాలతోనూ మాకు సంబంధం లేదు. ఇక స్పందించడానికి ఏముంటుంది’ అని తేల్చారు. మరోవైపు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌ను మరింత మెరుగుపర్చేందుకు క్రీడా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. -
రామచంద్రన్దే బాధ్యత
ఐఓఏ అధ్యక్షుడిపై క్రీడల మంత్రి గోయెల్ ఆగ్రహం ముంబై: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో వివాదాస్పద నియామకంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ నిప్పులు చెరిగారు. కళంకితులైన సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలా నియామకానికి ఐఓఏ చీఫ్ ఎన్.రామచంద్రనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసంబద్ద నిర్ణయం. చర్చలోనే లేని అంశానికి ప్రాధాన్యమివ్వడమేంటి... ఏకగ్రీవ నియామకమంటూ ఆమోదించడమేంటి? ఐఓఏ ప్రధాన విధి నైతిక విలువలకు కట్టుబడి ప్రాథమిక సూత్రాలను పాటించడం.క్రీడల్లో పారదర్శక పాలన అందించడం. కానీ చేసిందేమిటి? చార్జిషీట్ నమోదైన వ్యక్తులను అందలమెక్కించింది. దీనిపై షోకాజ్ నోటీసులిచ్చాం. శుక్రవారంకల్లా ఐఓఏ సంజాయిషీ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని గోయెల్ అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చార్టర్‌ను కాదని, ఐఓఏ నియమావళిని విస్మరించి తీసుకున్న నిర్ణయాలను క్రీడాశాఖ ఎంతమాత్రం సమ్మతించదని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ చౌతాలా నియామకాన్ని ఐఓసీ ఏమాత్రం గుర్తించలేదని ఆయన గుర్తు చేశారు. మరో వైపు ఇంత వివాదం రేగుతున్నా భారత అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఐఓసీ అభ్యంతరం చెబితేనే గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని లేదంటే కొనసాగుతానని చెప్పారు. కల్మాడీ తన నిర్దోషిత్వం నిరూపించుకునే వరకు పదవి చేపట్టబోనని బుధవారమే ప్రకటించారు. -
నాలుగేళ్లలో 379 మంది డోపీలు...
న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల కాలంలో భారత్‌లో 379 మంది క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అందించిన సమాచారం ప్రకారం 2013లో 96 మంది... 2014లో 95 మంది, 2015లో 120 మంది... ఈ ఏడాది అక్టోబరు వరకు 68 మంది క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడ్డారని విజయ్ గోయల్ తెలిపారు. -
విదేశీ కోచ్‌ల ఎంపికలో కేంద్రం జోక్యం
క్రీడా మంత్రి విజయ్ గోయల్ న్యూఢిల్లీ: ఇక నుంచి జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్) ఆయా విభాగాల్లో నియమించే విదేశీ కోచ్‌ల విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. 2020 ఒలింపిక్స్‌కు ఎలా సన్నద్ధమవాలనే అంశంపై వివిధ క్రీడా ప్రముఖులతో నాలుగు గంటలపాటు మంత్రి చింతన్ బైఠక్ జరిపారు. ఇందులో షూటర్ గగన్ నారంగ్, మాజీ హాకీ ఆటగాళ్లు వీరేన్ రస్కిన్హా, జగ్బీర్ సింగ్, సాయ్ మాజీ డెరైక్టర్ జనరల్ పాల్గొన్నారు. ‘వచ్చే ఒలింపిక్స్‌కు ఇప్పటినుంచే మన సన్నాహకాలు ప్రారంభం కావాలి. అందుకే ఈ సమావేశం. ఈ విషయంలో ఇప్పటికే అనేక సూచనలు వచ్చారుు. దేశంలోని క్రీడా వసతులతో పాటు పూర్తి నివేదిక రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం భారత కోచ్‌లకు రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆయా సమాఖ్యలు విదేశీ కోచ్‌లను కూడా నియమించుకుంటున్నారుు. అరుుతే వీరు ఎక్కడెక్కడ అవసరమో ఆ పోస్టులను మేమే ప్రకటిస్తాం. ఎన్ఎస్ఎఫ్ నిర్వహించే అన్ని ఈవెంట్లకు మేం మద్దతిస్తాం. అరుుతే అవి పూర్తి పారదర్శకంగా ఉండాలి’ అని గోయల్ తేల్చారు. అలాగే ఇటీవల ఆసియా మహిళల హాకీ చాంపియన్స ట్రోఫీ నెగ్గిన భారత జట్టును మంత్రి సన్మానించారు. -
ఉమ్మడి జాబితాలోకి క్రీడలు!
న్యూఢిల్లీ: దేశంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పని చేయాల్సి ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయ పడ్డారు. ఇందులో భాగంగా క్రీడలను ఉమ్మడి జాబితాలో చేర్చాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. గురువారం వేర్వేరు క్రీడల జాతీయ సమాఖ్యలతో ఆయన సమావేశం నిర్వహించారు. 20కు పైగా సమాఖ్యల ప్రతినిధులు హాజరై ఉమ్మడి జాబితాకు మద్దతుగా తీర్మానం చేశారు. ప్రస్తుతం క్రీడలు కేంద్ర జాబితాలో ఉన్నారుు. అరుుతే 2009లోనూ కేంద్రం ఇదే ప్రయత్నం చేసినా... రాష్ట్రాలు ముందుకు రాకపోవడం, ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో ప్రభుత్వం బిల్లును పక్కన పెట్టేసింది. ఈ సారి మాత్రం రాష్ట్రాలను ఒప్పిస్తామని గోయల్ చెప్పారు. మరో వైపు ‘ఇతర’ క్రీడల జాబితాలో ఉన్న వేర్వేరు క్రీడాంశాలకు నిధులను పునరుద్ధరించాలని కూడా నిర్ణరుుంచారు. వీటిని 2014లో ఆపేశారు. -
తప్పనిసరి పాఠ్యాంశంగా క్రీడలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి పాఠశాల స్థారుులో క్రీడలను ఓ పాఠ్యాంశంగా చేర్చాలనే ఆలోచన ఉందని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ చెప్పారు. ‘చాలా పాఠశాలల్లో క్రీడలను అసలు పట్టించుకోవడం లేదు. పిల్లలకు ఆడుకునేందుకు సమయం ఇవ్వడంతో పాటు క్రీడలను పాఠ్యాంశంగా చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండటం తప్పనిసరి చేయబోతున్నట్లు చెప్పారు. -
ఒక్క మంత్రి కోసం 25 కోట్ల మినహాయింపా?
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క వ్యక్తి ఆస్తికి పన్నును మినహాయించడం కోసం ఏకంగా 750 ఇళ్లపై ఆస్తి పన్నును రద్దు చేసిందని, ఫలితంగా ఇప్పటికే ఈ ఏడాది 2,700 కోట్ల రూపాయల లోటుతో నడుస్తున్న మున్సిపల్ కార్పొరేషన్‌పై మరో 25 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ గోయెల్ కుటుంబానికి ధర్మపురలో ఓ చారిత్రక హవేలి ఉంది. నాలుగంతస్తులుగల ఆ భవంతిలో 13 గదులు ఉన్నాయి. వాటిలో రెస్టారెంట్, స్పా, ఆర్ట్ గ్యాలరీలు కమర్షియల్‌గా నడుస్తున్నాయి. కమర్షియల్ కార్యకలాపాలకుగాను ఇంటిపన్నును, కార్ పార్కింగ్ చార్జీలను ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేస్తూ వస్తోంది. ఈ పన్ను నుంచి మినహాయింపు కావాలని కోరుతూ గోయెల్ కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఒక్క దరఖాస్తుపైన మాత్రమే స్పందిస్తే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించిన కార్పొరేషన్ స్థాయీ సంఘం మొత్తం కార్పొరేషన్ పరిధిలోని 750 చారిత్రక భవనాలను పన్ను పరిధి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 750 భవనాల్లో ఖరీదైన రెస్టారెంట్లు, అతిథి గృహాలు, చేతికళలు, నగల దుకాణాలు నడుస్తున్నాయని, వాటిపై కోట్లలో అద్దె వస్తుండగా, పన్ను మినహాయింపు కల్పించడం అర్థరహితమని ఢిల్లీ ఆప్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కార్పొరేషన్ చర్యపై విరుచుకు పడుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తున్న విషయం తెల్సిందే.