పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇంతే!
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఊతమిచ్చినంత కాలం ఆ దేశంతో క్రీడా సంబంధాలు ఉండవని భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. తమ జట్లకు భారత హై కమిషన్ కావాలనే వీసాలు మంజూరు చేయడం లేదని పాకిస్తాన్ రెజ్లింగ్ సమాఖ్య మంగళవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన జాతీయ యూత్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గోయల్ పాక్ విషయంలో తమ వైఖరిని వెల్లడించారు.
‘దేశవిద్రోహ చర్యల్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టినిల్లు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. భారత సరిహద్దుల్లో పాక్ దౌర్జన్యాలు ఆపేవరకు మేం ఇలాగే మొండిగా ఉంటాం. ఉగ్రవాదానికి సహకరించినంత కాలం ఆదేశంతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు. మేం ఇలా చేయడం ద్వారా అక్కడి క్రీడాసంఘాలు వారి ప్రభుత్వంపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒత్తిడి పెంచుతాయి’ అని గోయల్ వివరించారు. మే 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే పాక్ రెజ్లింగ్ జట్లకు భారత హైకమిషన్ వీసాలు నిరాకరించడంతో ఆ జట్టు టోర్నీలో పాల్గొనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అంతకుముందు పాక్ స్క్వాష్ జట్లతో పాటు, గతేడాది పాకిస్తాన్ జూనియర్ హాకీ జట్టుకు కూడా భారత్ వీసాలు మంజూరు చేయలేదు.