డోపింగ్ పాల్పడితే ఇక జైలే
కొత్త చట్టం చేసే దిశగా కేంద్ర క్రీడాశాఖ
న్యూఢిల్లీ: డోపింగ్‌కు పాల్పడ్డవారికి జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకురావాలని భారత క్రీడామంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కోసం జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఒక సమావేశం ఏర్పాటుచేసి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ కూడా పాల్గొన్నారు. ‘ఇంతకుముందు జాతీయ స్థాయిలో ఉన్న డోపింగ్ సమస్య ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, పాఠశాల స్థాయిలకు కూడా చేరడం ఎంతో బాధిస్తోంది.
డోపింగ్‌ను క్రిమినల్ చర్యగా భావించి వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నాం. జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆటగాళ్లే కాక డోపింగ్ విషయంలో భాగస్వాములైన కోచ్‌లు, ట్రైనర్లు, డాక్టర్లను కూడా శిక్షించేలా చర్యలు తీసుకుంటాము’ అని గోయల్ ప్రకటించారు. ఆటగాళ్లు ఉపయోగించేందుకు అనువుగా ఉండే డ్రగ్ కంపెనీల పేర్లను వాడా ప్రకటిస్తే బాగుంటుందని గోయల్ అభిప్రాయపడ్డారు.
కోచి స్టేడియాన్ని తనిఖీ చేయనున్న గోయల్
వచ్చే అక్టోబర్‌లో సొంతగడ్డపై జరుగనున్న ఫిఫా అండర్–17 ప్రపంచకప్ ఏర్పాట్లపై కేంద్రం దృష్టిపెడుతోంది. ఈక్రమంలో ప్రపంచకప్ వేదికైన శుక్రవారం కేరళలోని కోచిలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ తనిఖీ చేయనున్నారు. ఈనెల ప్రారంభంలోనే ఫిఫా కమిటీ కోచి స్టేడియంపై సమీక్షించింది. మే 15 లోగా స్టేడియంలోని ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. గడుపు సమీపిస్తున్న వేళ ఏర్పాట్లను పరిశీలించడానికి గోయల్ కోచి రానున్నారు. అలాగే కోచిలోని సాయ్ కార్యకలపాలపైనా సమీక్ష సమావేశాన్ని గోయల్ నిర్వహించనున్నట్లు క్రీడా మంతిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కోచి స్టేడియాన్ని తనిఖీ చేసిన అనంతరం టోర్నీ మిగతా ఐదు వేదికలను కూడా సందర్శించనున్నట్లు పేర్కొంది. గతనెలలో ఫిఫా తనిఖీ బృందం స్థానిక జవహర్‌లాల్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మే 15లోగా పనులన్నీ పూర్తి చేయాలని నిర్వాహకులకు తుది గడువు విధించింది.