భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో వివాదాస్పద నియామకంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ నిప్పులు చెరిగారు.
ఐఓఏ అధ్యక్షుడిపై క్రీడల మంత్రి గోయెల్ ఆగ్రహం
ముంబై: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో వివాదాస్పద నియామకంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ నిప్పులు చెరిగారు. కళంకితులైన సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలా నియామకానికి ఐఓఏ చీఫ్ ఎన్.రామచంద్రనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా అసంబద్ద నిర్ణయం. చర్చలోనే లేని అంశానికి ప్రాధాన్యమివ్వడమేంటి... ఏకగ్రీవ నియామకమంటూ ఆమోదించడమేంటి? ఐఓఏ ప్రధాన విధి నైతిక విలువలకు కట్టుబడి ప్రాథమిక సూత్రాలను పాటించడం.క్రీడల్లో పారదర్శక పాలన అందించడం. కానీ చేసిందేమిటి? చార్జిషీట్ నమోదైన వ్యక్తులను అందలమెక్కించింది.
దీనిపై షోకాజ్ నోటీసులిచ్చాం. శుక్రవారంకల్లా ఐఓఏ సంజాయిషీ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని గోయెల్ అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చార్టర్‌ను కాదని, ఐఓఏ నియమావళిని విస్మరించి తీసుకున్న నిర్ణయాలను క్రీడాశాఖ ఎంతమాత్రం సమ్మతించదని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ చౌతాలా నియామకాన్ని ఐఓసీ ఏమాత్రం గుర్తించలేదని ఆయన గుర్తు చేశారు. మరో వైపు ఇంత వివాదం రేగుతున్నా భారత అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఐఓసీ అభ్యంతరం చెబితేనే గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని లేదంటే కొనసాగుతానని చెప్పారు. కల్మాడీ తన నిర్దోషిత్వం నిరూపించుకునే వరకు పదవి చేపట్టబోనని బుధవారమే ప్రకటించారు.