జొకోవిచ్కు చెక్ పెడతా: ఫెదరర్
లండన్: గత కొంతకాలంగా గ్రాండ్ స్లామ్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఎదురవుతున్న పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంటునంటున్నాడు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. గతంలో తన సర్వీస్తోపాటు, రిటర్న్ షాట్లు ఆడటంలో కొంతవరకూ ఇబ్బంది ఉన్నా, ప్రస్తుతం దాన్ని అధిగమించి వింబుల్డన్కు సిద్ధమైనట్లు ఫెదరర్ పేర్కొన్నాడు. మరికొద్ది రోజుల్లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈసారి జొకోవిచ్ను ఓడిస్తారా? అన్న ప్రశ్నకు ఫెదరర్ స్పందించాడు.
తన 100 శాతం ఆటను ప్రదర్శిస్తే జొకోవిచ్ను ఓడించడం కష్టమేమి కాదని స్పష్టం చేశాడు. గతేడాది మూడు టోర్నీల్లో జొకోవిచ్పై విజయం సాధించిన సంగతిని ఫెదరర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా, 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ తుది పోరులో జొకోవిచ్ చేతిలో ఫెదరర్ ఓటమి పాలై రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్లు గెలిచి మంచి ఊపుమీద ఉన్న జొకోవిచ్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై కన్నేశాడు. అయితే తనకు మాత్రం ఒకే ఏడాది మూడు గ్రాండ్ స్లామ్లు సాధించాల్సిన అవసరం లేదని ఫెదరర్ పేర్కొనడం గమనార్హం.
చివరిసారిగా 2012 లో వింబుల్టన్ ను గెలిచిన ఫెదరర్.. ఆ తరువాత పురుషుల గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ ను చేజక్కించుకోలేదు. 1998లో అంతర్జాతీయ టెన్నిస్ లో అడుగుపెట్టిన ఫెదరర్.. 2002లో తొలిసారి టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు. ఆ తరువాత గ్రాండ్ స్లామ్ ఎరాలో ఎన్నో టైటిల్స్ ను ముద్దాడినప్పటికీ ఇటీవల కాలంలో ఫైనల్ పోరులో తడబడుతున్నాడు. ఫెదరర్ ఖాతాలో 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటే.. అందులో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయి.
ఇదిలా ఉంచితే.. 29 ఏళ్ల జొకొవిచ్ మాత్రం కచ్చితమైన షాట్లతో అలరిస్తూ వరుస గ్రాండ్ స్లామ్ లను సాధిస్తున్నాడు. ఏ మాత్రం ఆందోళన చెందకుండా టెన్ని స్ రారాజు ఫెదరర్ కు చుక్కులు చూపిస్తున్నాడు. తొలిసారి 2007వ సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్ లో ఫెదరర్ కు చెక్ పెట్టి టైటిల్ ను జొకోవిచ్.. ఆ తరువాత 2008, 2011 సంవత్సరాలలో కూడా ఫెదరర్ ను అదే టోర్నీలో ఓడించాడు. 2015లో ఫెదరర్ ను ఓడించి వింబుల్డన్ గెలిచిన జొకోవిచ్.. అదే ఏడాది యూఎస్ ఓపెన్ ఫైనల్లో కూడా ఫెదరర్పై విజయం సాధించి ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ ఇద్దరి ముఖాముఖి పోరులో జొకోవిచ్ 23-22తో ముందంజలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, జూన్ 27వ తేదీ నుంచి ఆరంభం కానున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో జొకోవిచ్ కు టాప్ సీడింగ్ దక్కగా, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేకు రెండో సీడింగ్, ఫెదరర్ కు మూడో సీడింగ్ దక్కింది.