కేరళపై కోల్‌కతా విజయం
కోల్‌కతా: సొంత గడ్డపై తొలి మ్యాచ్.. అందునా ఆడింది ఫుట్‌బాల్ దిగ్గజం పీలే సమక్షంలో.. ఇంకేముంది డిఫెండింగ్ చాంప్ అట్లెటికో డి కోల్‌కతా ఆటగాళ్లు దుమ్ము రేపే ఆటను ప్రదర్శించారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ల్) రెండో సీజన్‌లో భాగంగా మంగళవారం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2-1తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని ఓడించింది. గత సీజన్ ఫైనల్ అనంతరం ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. కోల్‌కతా తరఫున అరాటా ఇజుమి (6వ నిమిషంలో), జేవీ లారా (53) గోల్స్ సాధించారు. కేరళకు క్రిస్ డగ్నల్ (80) గోల్ అందించాడు.
ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ప్రత్యక్షంగా చూసిన ఈ మ్యాచ్‌కు 61 వేల మందికిపైగా అభిమానులు వచ్చారు. సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌గా భావించిన ఈ సమ ఉజ్జీల సమరంలో కోల్‌కతా ఏమాత్రం అలక్ష్యం చూపలేదు. ఫలితంగా ఆరో నిమిషంలోనే ఇయాన్ హ్యూమే బంతిని ఆధీనంలోకి తీసుకుని గోల్ కోసం ప్రయత్నించినా కీపర్ అడ్డుకున్నాడు. అయితే బంతి అతడి చేతుల్లోంచి బయటకు రావడంతో వెంటనే అందుకున్న ఇజుమి శుభారంభం చేశాడు. ద్వితీయార్ధం 53వ నిమిషంలో హ్యూమే మరోసారి అందించిన పాస్‌ను లారా గురి తప్పకుండా గోల్‌గా మలిచాడు.
అయితే 80వ నిమిషంలో డగ్నల్ పోస్టుకు అతి సమీపం నుంచి కేరళకు గోల్‌ను అందించాడు. చివరి పది నిమిషాలు కేరళ పదే పదే కోల్‌కతా గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది. అయితే కోల్‌కతా గోల్‌కీపర్ కలాటుయుడ్ అడ్డుగోడలా నిలబడి ఆతిథ్య జట్టును ఆదుకున్నాడు. నేడు పుణేలో జరిగే మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే, ఢిల్లీ డైనమోస్ తలపడతాయి. రాత్రి 7.00 గంటలనుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం