
తొలి సెమీస్‌లో కేరళ విజయం
3-0తో చెన్నైయిన్ చిత్తు
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) తొలి సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ అదరగొట్టింది. టోర్నీలో టాప్ జట్టుగా కొనసాగుతున్న చెన్నైయిన్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేరళ 3-0తో నెగ్గింది. ఇష్ఫాఖ్ అహ్మద్, హ్యుమే, సుశాంత్ గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 61 వేల మంది హాజరయ్యారు. లీగ్ మ్యాచ్‌ల్లో దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను వణికించిన చెన్నైయిన్ జోరును కేరళ ప్రారంభం నుంచే పథకం ప్రకారం అడ్డుకోగలిగింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించి ప్రత్యర్థిని వణికించింది. 27వ నిమిషంలో విక్టర్ నుంచి అందుకున్న పాస్‌ను మిడ్‌ఫీల్డర్ ఇష్ఫాఖ్ అహ్మద్ కుడి కాలుతో నేర్పుగా గోల్‌పోస్టులోకి పంపాడు.
ఆ తర్వాత 29వ నిమిషంలోనే ఇయాన్ హ్యుమే రెండో గోల్ అందించడంతో జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో చెన్నైయిన్ గోల్ అవకాశాలను కేరళ గోల్‌కీపర్ సందీప్ నంది సమర్థవంతంగా అడ్డుకున్నాడు. మ్యాచ్ చివర్లో (90వ నిమిషంలో) ఇయాన్ హ్యుమే పాస్‌ను సబ్‌స్టిట్యూట్ సుశాంత్ ఇద్దరు డిఫెండర్లను దాటుకుంటూ సూపర్ గోల్ సాధించగా జట్టు విజయం ఖాయమైంది. కోల్‌కతాలో ఆదివారం జరిగే మరో సెమీఫైనల్లో గోవాతో కోల్‌కతా తలపడుతుంది.