
సహచరుల ప్రోత్సాహం వల్లే...
పార్థీవ్ పటేల్
న్యూఢిల్లీ: సహచరులు ప్రోత్సహించడం వల్లే పునరాగమనంలో రాణించగలిగానని పార్థీవ్ పటేల్ అన్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన అతను ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్‌సల్లోనూ రాణించిన సంగతి తెలిసిందే. ‘కెప్టెన్ కోహ్లి సహా మిగతా ఆటగాళ్లు నన్ను పునరాగమనం చేసిన ఆటగాడిగా చూడలేదు. ఇదే నేను నూతనోత్సాహంతో ఆడేందుకు దోహదపడింది. డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న ఈ వాతావరణమే ఒత్తిడి లేకుండా రాణించేందుకు ఉపయోగపడింది’ అని ఈ గుజరాత్ వికెట్ కీపర్ అన్నాడు.
దేశానికి ఆడటమే గొప్ప గౌరవమని చెప్పిన పార్థీవ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి జట్టులోకి రావడమనేది కష్టమైన పని అని అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణించడం కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యేందుకు దోహదపడిందని పార్థీవ్ చెప్పాడు. తొలి ఇన్నింగ్‌సలో 42 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్‌సలో అజేయంగా 67 పరుగులు చేశాడు.