పుజారాకు చోటు కష్టమే!
కుండబద్దలు కొట్టిన రవిశాస్త్రి
ఐదుగురు బౌలర్లు కావాలన్న డెరైక్టర్
గాలేలో భారత జట్టు సాధన
గాలే: టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా బ్రాండ్ ఉన్నా... ప్రస్తుత భారత తుది జట్టులో చతేశ్వర్ పుజారాకు స్థానం దక్కడం కష్టమేనని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. పుజారాకంటే రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వడమే సరైనదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఐదుగురు బౌలర్ల వ్యూహానికి తాము కట్టుబడినంత వరకు సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ను ఆడించలేమని పరోక్షంగా చెప్పారు. ‘జట్టులో అత్యుత్తమ ఐదుగురు ఆటగాళ్లలో పుజారా ఒకడైతే అతను మ్యాచ్ ఆడతాడు. లేదంటే లేదు. మేం నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే మాత్రం అతను పునరాగమనం చేస్తాడని నాకు నమ్మకముంది. నా దృష్టిలో రోహిత్ క్లాస్ ఆటగాడు. ఒక్కసారి నిలదొక్కుకుంటే అద్భుతాలు చేయగలడు. కౌంటర్ అటాక్ చేసేందుకు గానీ క్రీజ్‌లో నిలబడేందుకు గానీ మూడో స్థానమే అతనికి సరైంది’ అని శాస్త్రి వ్యాఖ్యానించారు.
‘డ్రా’ కోసం ఆడలేం
ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్లు ఉండటం తప్పనిసరి అని, ఈ విషయంలో కోహ్లి ఆలోచనకు తాను మద్దతు ఇస్తున్నట్లు రవి చెప్పారు. ఏ జట్టు కూడా డ్రా కోసం బరిలోకి దిగదని, అందుబాటులో ఉన్న వనరులతోనే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఆడుతుందన్న శాస్త్రి...ఇక విదేశాల్లో నిలకడగా విజయాలు సాధించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గత రెండు దశాబ్దాలుగా శ్రీలంకలో భారత్ సిరీస్ విజయాన్ని అడ్డుకోవడంలో మురళీధరన్ కీలక పాత్ర పోషించాడని... ఇప్పుడు అతను లేడనే విషయాన్ని గుర్తు చేశారు. ఇరు జట్లు ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయన్నారు. తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో ఆడే విషయం వాతావరణంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రి వెల్లడించారు.
చెమటోడ్చిన బౌలర్లు...
తొలి టెస్టు సన్నాహకాల్లో భాగంగా సోమవారం భారత జట్టు సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేసింది. వామప్ డ్రిల్స్‌తో పాటు ఎక్కువ సేపు నెట్స్‌లో ఆటగాళ్లు సాధన చేశారు. సెషన్‌ను రవిశాస్త్రి ఆసాంతం పర్యవేక్షించారు. స్పిన్నర్లు అశ్విన్, మిశ్రా ఎక్కువ సేపు బౌలింగ్ చేయగా...హర్భజన్ కొద్ది సేపు బౌలింగ్ చేసి ఎక్కువగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. మిశ్రాకు ప్రత్యేక సూచనలు ఇచ్చిన శాస్త్రి, ఇషాంత్‌తో కూడా సుదీర్ఘంగా సంభాషించారు. కోహ్లి స్వయంగా ఆటగాళ్లతో క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించాడు. అయితే వర్షం కారణంగా భారత ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగింది. కొద్ది సేపు వాన రావడంతో ఇండోర్‌లోకి వచ్చిన ఆటగాళ్లు తిరిగి ప్రాక్టీస్‌ను కొనసాగించారు. అయితే వర్షం కారణంగా శ్రీలంక జట్టు ప్రాక్టీస్ మాత్రం దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. గాలేలో రాబోయే వారం రోజులు కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
క్లీన్‌స్వీప్ చేస్తే మూడో ర్యాంక్‌కు...
శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకుకు చేరే అవకాశం ఉంది. అయితే మరో వైపు యాషెస్‌లో చివరి టెస్టు ఆస్ట్రేలియా గెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతోంది.