ఈ ఐపీఎల్ను మరచిపోదాం..
న్యూఢిల్లీ:తమకు అంతగా కలిసిరాని ఐపీఎల్-10 సీజన్ను రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లు ఎంత తొందరగా మరచిపోతే అంత మంచిదని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఓవరాల్ ఐపీఎల్లో తమపై అత్యంత ప్రభావం చూపిన సీజన్ ఏదైనా ఉందంటే అది ఇదేనని కోహ్లి పేర్కొన్నాడు. ఈ సీజన్ చాయలు ఎక్కడ కనిపించకుండా తదుపరి ఐపీఎల్ కు సిద్ధమవుతామని పేర్కొన్నాడు.
'మా యావత్ జట్టు ప్రదర్శనపై విపరీతమైన ప్రభావం చూపిన ఐపీఎల్ సీజన్ ఇది. ఇది మాకు కచ్చితంగా ఒక గుణపాఠమే. మేము ఎలా విఫమయ్యామో అన్వేషించుకోవడానికి ఈ సీజన్ ఉపయోగపడుతుంది. అదే సమయంలో పునరుత్తేజంతో సన్నద్ధం కావడానికి కూడా దోహదం చేస్తుంది' అని కోహ్లి పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన తరువాత కోహ్లి మీడియాతో మాట్లాడాడు. దీనిలో భాగంగా యువ పేసర్లు హర్షల్ పటేల్(3/43), అవేష్ ఖాన్(1/23)ల ప్రదర్శనపై కోహ్లి పొగడ్తలు కురిపించాడు. వీరిద్దరూ మనసు దోచుకునే విధంగా ఆడారని కొనియాడాడు. ఈ పిచ్ పై వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం చేయలేని పనిని వీరిద్దరూ సమర్ధవంతంగా నిర్వర్తించారంటూ ప్రశంసించాడు.