నాపై బాధ్యత మరింత పెరిగింది!
ఇంకా శ్రమించాల్సి ఉంది
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
ముంబై: ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో తనపై అంచనాలు ఎక్కువయ్యాయని, ఇక ముందు మరింతా బాగా ఆడాల్సి ఉంటుందని స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకం సాధించినప్పుడు ప్రపంచం తనను గుర్తించిందని, ఇప్పుడు ఒలింపిక్స్‌తో అందరికీ చేరువయ్యానని ఆమె చెప్పింది. సింధుకు గత ఆరేళ్లుగా అండగా నిలిచిన ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) బుధవారం ఆమెను ఘనంగా సన్మానించింది. ‘భవిష్యత్తులో అందరి దృష్టి నాపైన ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.
నా ఘనతల పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పోలిస్తే ఈ పతకం విలువ చాలా ఎక్కువ. ఓజీక్యూ ఇచ్చిన సహకారంతోనే నా తొలి టైటిల్ మాల్దీవ్‌స ఇంటర్నేషనల్ గెలవగలిగా‘ అని సింధు చెప్పింది. ఈ కార్యక్రమంలో కోచ్ గోపీచంద్‌తో పాటు సింధు తల్లిదండ్రులు రమణ, విజయలను కూడా సత్కరించారు.