
శామ్యూల్స్ తీరు సరికాదు:రస్సెల్
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలిచిన అనంతరం ఆ జట్టు ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ మీడియా మైకులు పెట్టే బల్లపై కాళ్లు పెట్టడం ఎంతమాత్రం సరికాదని సహచర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ తాజాగా పేర్కొన్నాడు.
ముంబై: ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్ గెలిచిన అనంతరం ఆ జట్టు ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ మీడియాతో వ్యవహరించిన తీరు ఎంతమాత్రం సరికాదని సహచర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ తాజాగా పేర్కొన్నాడు. ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన శామ్యూల్స్ మీడియా మైకులు పెట్టే బల్లపై కాళ్లు పెట్టి శృతిమించి వ్యవహరించడాన్ని రస్సెల్ తప్పుబట్టాడు. ఈ విషయంపై ఇప్పటికే తనను చాలా మంది అభిమానులు అడిగినట్లు రస్సెల్ తెలిపాడు. ఇలా వ్యవహరించిన అతను జమైకా ఆటగాడేనా అంటూ తనను కొంతమంది నిలదీశారన్నాడు. అతను జమైకా నుంచి వచ్చిన ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న ఆటగాడని బదులిచ్చినట్లు రస్సెల్ స్పష్టం చేశాడు.
ఇందులో తాను చెప్పడానికి ఏమీ లేదంటూ ఓ వైపు అంటూనే, శామ్యూల్స్ వ్యవహరించిన తీరు మాత్రం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. తాము వరల్డ్ కప్ గెలవడం ఒక మధురమైన జ్ఞాపకంగా రస్సెల్ పేర్కొన్నాడు. కప్ గెలిచిన ఆనందాన్ని ఒక వారం పాటు సెలబ్రేట్ చేసుకున్నామని, అది అంతవరకే పరిమితమన్నాడు. కాకపోతే శామ్యూల్స్ లో ఉత్సాహం అధికమై అలా ప్రవర్తించి ఉంటాడని రస్సెల్ అన్నాడు.