ఒలింపిక్ప్లో ఓ శకం ముగిసినట్లే!
రియో డీ జనీరో: ఇక ఒలింపిక్స్ లో ఉసేన్ బోల్ట్ శకం ముగిసినట్లే. పరుగును పరుగుల రారాజు బోల్ట్ తన ఒలింపిక్స్ కెరీర్ ను ఘనంగా ముగించాడు. రియో ఒలింపిక్స్ లో 4x100 రిలేలో జమైకా జట్టు స్వర్ణం గెలవడంతో ట్రిపుల్ ట్రిపుల్ గా నిలవాలన్న కోరికను తీర్చుకున్న బోల్ట్.. తన చివరి ఒలింపిక్ రేసును అభిమానులకు మధుర జ్ఞాపకంగా మిగిల్చాడు. బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణంతో మొదలైన బోల్ట్ పరుగు.. రియో వరకూ ఆగలేదు. ఈ ఒలింపిక్స్ బరిలోకి దిగిన మూడు ఈవెంట్లోనూ పసిడిని సాధించాలనే తపనతో చెలరేగిన బోల్ట్ ఒలింపిక్స్ లో పరుగుల రారాజుగా నిలిచాడు.
శనివారం తెల్లవారుజామున జరిగిన 4x100 రిలేలో బోల్ట్,అసాఫా పావెల్, నికెల్ అష్మేడ్, యొహాన్ బ్లేక్లతో కూడిన జమైకా జట్టు 37.27 సెకెండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు వరుస ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల రిలేలో పసిడి సాధించిన స్ప్రింటర్ గా బోల్ట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో కూడా బోల్ట్ పసిడి పంట పండించిన బోల్ట్.. ఒలింపిక్స్ లో అపజయమే ఎరుగని చిరంజీవిగా నిలిచాడు. అయితే ఇదే తన చివరి ఒలింపిక్స్ అన్న బోల్ట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, జమైకాకు రేస్ కింగ్గా నిలిచిన బోల్ట్ పరుగును ఒలింపిక్స్ లో చూసే అవకాశం దాదాపు లేనట్లే.
రియో ఒలింపిక్స్లో మూడు స్వర్ణాలను సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన బోల్ట్ ఆద్యంతం ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియోలో వంద మీటర్ల పరుగును 9.81 సెకెండ్లలో ముగించి పసిడిన గెలిచిన బోల్ట్.. 200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించాడు. ఇక జట్టు రేసుకొచ్చేసరికి జమైకా స్వర్ణం సాధించడంలో బోల్ట్ కీలక పాత్ర పోషించాడు.
రికార్డులు..
ఈ ఒలింపిక్స్ లో 100 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న బోల్ట్.. ఈ ఘనతను వరుసగా మూడు ఒలింపిక్స్లో సాధించిన ఏకైక అథ్లెట్గా నిలిచాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ ఈ ఈవెంట్‌లో పసిడి పతకం సాధించి 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిదాన్ని సాధించాడు. మరోవైపు 4x 100 రిలేలో స్వర్ణం సాధించడంతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఒలింపిక్స్ లో తొమ్మిది పతకాలు సాధించిన అథ్లెటిక్స్ కార్ల్ లూయిస్, ఫిన్ పావో నుర్మిస్ల సరసన బోల్ట్ నిలిచాడు. దాంతో పాటు 4x 100 రిలేలో పసిడి సాధించి ఈ విభాగంలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించిన రెండో స్ప్రింటర్ గా బోల్ట్ నిలిచాడు. అంతకుముందు అమెరికన్ దిగ్గజం ఫ్రాంక్ వైకాఫ్(1928, 1932, 1936) ఒక్కడే 4x 100 రిలేలో వరుస పసిడి పతకాలను సాధించాడు. మొత్తంగా ఒలింపిక్స్లో బోల్ట్ ఖాతాలో తొమ్మిది స్వర్ణ పతకాలు చేరగా, 2008నుంచి ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు కలిపి 20 స్వర్ణాలు సాధించాడు.