
ఐపీఎల్ జట్ల 'టెండర్ల' ప్రక్రియ పూర్తి
ముంబై: రాబోవు రెండు సీజన్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పాల్గొనే రెండు కొత్త జట్లను ఆహ్వానించేందుకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 2016, 2017 ఐపీఎల్ సీజన్ లో రెండు కొత్త జట్ల ఎంపికలో భాగంగా ఈనెల 16వ తేదీన భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) టెండర్ నోటీసును విడుదల చేసింది. ఇందుకు 15 రోజులు గడువు ఇచ్చిన బీసీసీఐ ఆ ప్రక్రియ ఈరోజుతో పూర్తయినట్లు స్పష్టం చేసింది. కాగా, ఐపీఎల్ జట్ల వేలాన్ని డిసెంబర్ 8వ తేదీన నిర్వహించనున్నట్లు లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. కొత్త టీమ్ ను కొనుగోలు చేయడానికి కనీస ధరను రూ.40 కోట్లుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీల స్థానంలో కొత్తగా ఎంపికైన రెండు జట్లు ఆడనున్నాయి. దీంతో తదుపరి ఐపీఎల్ కూడా ఎనిమిది జట్లతోనే జరుగనుంది. జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని భావించిన బీసీసీఐ గత నెల్లో చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ పై రెండేళ్ల పాటు వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 2016, 2017 సీజన్‌లకు చెన్నై, రాజస్తాన్ జట్లు దూరంగా ఉండనున్నాయి. 2018 సీజన్ లో అంటే రెండేళ్ల అనంతరం నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ లు తిరిగి బరిలో ఉంటాయి.