బరిందర్ స్రాన్ పై ఆసీస్ దృష్టి
పెర్త్: టీమిండియాతో మంగళవారం పెర్త్ వేదికగా తొలి వన్డే ఆడనున్న ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు ఒకే ఒక చర్చ కొనసాగుతోంది. ఇరు జట్లు ఐదు వన్డేల సిరీస్ సమరానికి సన్నద్ధమవుతున్నతరుణంలో టీమిండియా మీడియం పేసర్ బరిందర్ స్రాన్ గురించి ఆసీస్ జట్టు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆ ఆల్ రౌండర్ బ్యాటింగ్ తీరుతో పాటు, బౌలింగ్ ఏ రకంగా ఉండబోతుంది? అనే దానిపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దృష్టి సారించాడు. గత ఐపీఎల్లో బరిందర్ తో ఆడిన అనుభవం ఉన్న స్మిత్.. ఆ బౌలర్ ఆకట్టుకున్నవిధానాన్ని తన సహచర ఆటగాళ్లకు వివరించే పనిలో పడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో గాయపడిన మహ్మద్ షమీ స్థానంలో బరిందర్ ను తుది జట్టులో తీసుకుని అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అతనిపై ఆసీస్ దృష్టి సారించింది.
'నేను అతని బౌలింగ్ ను భారత్ లో ఎక్కువగా చూడకపోయినా.. ఐపీఎల్లో అతని బౌలింగ్ నాకు పరిచయం ఉంది. ఇద్దరం రాజస్థాన్ కు ఆడుతున్నప్పుడు బరిందర్ చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. మంచి పొడువున్న బరిందర్ ఎడమ చేతి వాటం బౌలర్ . బంతిని ఇరు వైపులా బాగా స్వింగ్ చేయగలడు. అతనొక వైవిధ్యమైన బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు'అని ఆసీస్ ఆటగాళ్లను ముందుగా స్మిత్ హెచ్చరించాడు. ఆసీస్ లో పిచ్ లో పేస్ కే అనుకూలించే అవకాశం ఉండటంతో మొత్తం సిరీస్ లో పేస్ బౌలర్లతోనే టీమిండియాపై ఎదురుదాడి చేయనున్నట్లు స్మిత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.