కేదర్ జాదవ్ ఒక్కడే..
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 158 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో విఫలం కావడంతో సాధారణ లక్ష్యాన్ని మాత్రమే ఢిల్లీ ముందు ఉంచకల్గింది. ఈ మ్యాచ్ లో కేదర్ జాదవ్ ఒక్కడే ఒంటరి పోరు చేయడంతో ఆర్సీబీ 150 పరుగుల మార్కును దాట కల్గింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. క్రిస్ గేల్(6), మన్ దీప్ సింగ్(12)వికెట్లను ఆర్సీబీ ముందుగానే కోల్పోయింది. ఆ తరుణంలో షేన్ వాట్సన్(24) కాస్త ఫర్వాలేదనిపించాడు. కాగా, వాట్సన్ మూడో వికెట్ గా అవుటైన తరువాత కేదర్ జాదవ్ బాధ్యతాయుతంగా ఆడాడు. కేదర్ జాదవ్ 37 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. అయితే అతనికి అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. ఆర్సీబీ ఆటగాళ్లు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కో్ల్పోయి 157 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ మూడు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్, నదీమ్ లకు తలో వికెట్ దక్కింది. మరి ఈ సాధారణ లక్ష్య పోరులో పైచేయి ఎవరు సాధిస్తారో చూడాలి.