మొత్తంగా విజయ సారథిగా మారాడు! అతడే జాసన్ ఒమర్ హోల్డర్! వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్! ఇంగ్లండ్‌పై తాజాగా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడీ బార్బడోస్ ఆటగాడు. ఒకప్పుడు తనను తీవ్రంగా విమర్శించిన వారికి దీటైన ఆటతో సమాధానమిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నయా నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
సాక్షి క్రీడా విభాగం
కరీబియన్ క్రికెట్ జట్టంటేనే నాలుగు ముక్కలను ఒకచోటకు చేర్చిన పటం. ఆర్థిక సమస్యలు, ఆటగాళ్లలో అనైక్యత, ఒక దేశంగా బరిలో దిగుతున్నా మైదానంలో కనిపించని ఆ స్ఫూర్తి, ఎవరికి వారు ప్రపంచ వ్యాప్త లీగ్‌లతో బిజీ బిజీ! ఒకరిద్దరి మెరుపులు తప్ప రెండు దశాబ్దాలుగా ఆ జట్టు ప్రమాణాలు తిరోగమనంలోనే ఉన్నాయి. అలాంటిది ఇటీవల క్రమంగా మెరుగు పడుతోంది. తుది జట్టులో ఎవరుంటారో ఎవరుండరో అనే ఒకప్పటి అనిశ్చితి నుంచి బయట పడి కొంత కలసికట్టుగానూ కనిపిస్తోంది. ఈ మొత్తం ఘనతకు కారణంగా చెప్పుకోకున్నా అందులో కాస్త ఎక్కువ భాగం హోల్డర్‌కే దక్కుతుంది.
‘కెప్టెన్‌గా తగినవాడేనా?’ అంటూ అంతకుముందున్న డారెన్ సామీపై వచ్చినట్లే తనపైనా తలెత్తిన సందేహాలను పంటాపంచలు చేస్తున్నాడు. తన స్థిరమైన ప్రదర్శనతో‘అసలు కెప్టెన్ అంటూ ఒకడున్నాడు’ అని చెప్పుకొనే పరిస్థితి కల్పించాడతడు. దిగ్గజ ఆటగాడు గ్యారీ సోబర్స్ తర్వాత 45 ఏళ్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచిన తొలి వెస్టిండీస్ క్రికెటర్ హోల్డర్ కావడమే దీనికి నిదర్శనం.
పరిస్థితులకు ఎదురొడ్డి...
బంతిపై నియంత్రణతో పాటు ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ బౌలింగ్ చేసే హోల్డర్ 2010 అండర్–19 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ తరఫున అత్యధిక వికెట్లు (13) పడగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో తర్వాతి ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2014లో న్యూజిలాండ్‌పై అరంగేట్ర టెస్టులో అర్ధ సెంచరీతో పాటు రెండు వికెట్లు తీశాడు. 2015 ప్రపంచ కప్‌లో విండీస్ సారథి హోల్డరే.
అయితే, జట్టులోని అప్పటి పరిస్థితుల కారణంగా తాను చేసేదేమీ లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో జట్టు మూడే గెలిచి ఇంటి ముఖం పట్టింది. ఆ సమయంలో సీనియర్లు తనను ఖాతరు చేయకున్నా వారిని హోల్డర్ వేలెత్తి చూపలేదు. కాలమే సమాధానం చెబుతుందన్నట్లు మందుకెళ్లాడు. ఇది నిజమే అన్నట్లు... ప్రతిభావంతులైనప్పటికీ అప్పటి ఆటగాళ్లంతా నేడు ఫామ్ కోల్పోయో, ప్రవర్తన బాగో లేకనో, మరే ఇతర కారణంతోనో జట్టుకు దూరమయ్యారు.
పసిగట్టింది క్లయివ్ లాయిడ్...
ప్రతిభకు లోటు లేని విండీస్ క్రికెట్‌ను పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకం. ‘జట్టు కెప్టెన్‌గా ఎవరుండాలి’ అనేది కూడా వీటిలో ఒకటి. నలుగురైదుగురు ఆటగాళ్లు సారథ్యం కోసం పోటీ పడిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. అలాంటిది, వన్డేలు (2013), టెస్టు (2015)ల్లో అరంగేట్రం చేసిన మరుసటి ఏడాదిలోనే హోల్డర్ కెప్టెన్ అయిపోయాడు. అయితే, ఈ నియామకం వెనుక వెస్టిండీస్ దిగ్గజ సారథి క్లయివ్ లాయిడ్ ముందుచూపు ఉంది. నిండా పాతికేళ్లు కూడా లేని యువకుడికి పగ్గాలప్పగించడం ఏమిటంటూ అందరూ విస్తుపోయారు. ఇది సింహాల ముందుకు పిల్లాడిని తోసినట్లుందని ఎద్దేవా చేశారు.
కానీ, ‘వయసుకు మించిన పరిణతితో హోల్డర్‌లో ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది’ అని లాయిడ్ నమ్మాడు. బౌలింగ్‌లోనో, బ్యాటింగ్‌లోనో పనికొస్తాడని భావించాడు. పరిస్థితుల కారణంగా మొదట్లో తడబడినా తర్వాత హోల్డర్ ఆ నమ్మకాన్ని క్రమంగా నిలబెట్టుకున్నాడు. జట్టు సభ్యులపై విశ్వాసం ఉంచుతూ సారథిగా ఎదిగాడు. నాలుగు నెలల క్రితం భారత్‌లో పర్యటన సందర్భంగానూ టీంపై అతడి ముద్ర స్పష్టంగా కనిపించింది. గాయంతో హోల్డర్ తొలి టెస్టు (రాజ్‌కోట్)కు దూరంగా కాగా ఆ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది.
హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు బరిలో దిగిన అతడు అర్ధ సెంచరీతో పాటు ఐదు వికెట్లూ పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. దీంతో జట్టు కాస్తంతైనా నిలవగలిగింది. ప్రస్తుతం సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో హోల్డర్ సత్తా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తొలి టెస్టులో అజేయ డబుల్ సెంచరీతో, రెండో టెస్టులో బౌలింగ్‌లో మెరిశాడు. ఇదే క్రమంలో టెస్టు చర్రితలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ద్విశతకం బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు.
అప్పట్లో అతడి గురించి...
►జట్టులోకి ఎంపికే అసమంజసం అన్నారు...
►ఆటగాడిగా సామర్థ్యాన్ని శంకించారు...
►కెప్టెన్‌గా ప్రకటించినపుడైతే అంతా నవ్వుకున్నారు...
మరిప్పుడు అతడు...
►నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు...
►నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు...
►కకావికలుగా ఉండే కరీబియన్లను ఒకతాటిపైకి తెచ్చాడు...
పొడగరి... సిగ్గరి
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పొడగరి హోల్డర్ (దాదాపు 6 అడుగుల 6 అంగుళాలు). మృదు స్వభావానికి తోడు చిరునవ్వు కూడా అంత తొందరగా నవ్వనంతటి సిగ్గరి. ఆఖరికి కెప్టెన్‌గా ప్రకటించిన సందర్భంలోనూ అతడి హావభావాల్లో పెద్దగా మార్పులు కనిపించ లేదు. మానసికంగా చూస్తే మాత్రం హోల్డర్ చాలా గట్టివాడు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆ ప్రభావం ముఖంలో కనిపించనివ్వడు. మొండిగా పోరాడుతూ పోతుంటాడు. 2015 ఇంగ్లండ్ పర్యటనే ఇందుకు నిదర్శనం.
189 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు... 214 నిమిషాలు క్రీజులో నిలిచి కెరీర్ తొలి సెంచరీ బాది జట్టును గట్టెక్కించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో గాలి దిశకు అనుగుణంగా బంతులేయమని కెప్టెన్‌గా తను చేసిన సూచనలను బౌలర్లు పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి. మరొకరైతే, వీటిని విని వదిలేసేవారే. హోల్డర్ మాత్రం... ‘జాగ్రత్తగా వినండి. మా పేసర్లు కఠిన పరిస్థితులకు ఎదురొడ్డారు. నేనెప్పుడు కోరినా బంతిని అందుకుని తమ శక్తిమేర ప్రయత్నించాడు. ఎవరూ వెనక్కుతగ్గలేదు’ అంటూ గట్టిగా బదులిచ్చాడు.
నాయకుడనిపించుకున్నాడు..
ఇంగ్లండ్‌పై తాజా సిరీస్ విజయాన్ని శనివారం మృతి చెందిన యువ పేసర్ అల్జారీ జోసెఫ్ తల్లికి అంకితమిస్తూ హోల్డర్ కెప్టెన్‌గా తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ సందర్భంగా జోసెఫ్ అంకితభావంతో పాటు విజయ భావనలో ఆలోచించి ముందుకెళ్తుందంటూ విండీస్ జట్టు ఆటపైనా ప్రశంసలు కురిశాయి.
ఇది అతడి జట్టే
ఓపెనింగ్‌లో బ్రాత్‌వైట్, మిడిలార్డర్‌లో చేజ్, హోప్, హెట్‌మైర్‌తో పాటు హోల్డర్ తోడుగా పేసర్లు గాబ్రియెల్, రోచ్‌లతో విండీస్ టెస్టు జట్టు (ముఖ్యంగా పేస్ పిచ్‌లపై) బలంగా ఉంది. వీరంతా హోల్డర్ నేతృత్వంలోనే ఎదిగారు. నిలకడగానూ ఆడుతున్నారు. దీనిని కొనసాగిస్తే ఆ దేశ క్రికెట్ పునరుజ్జీవం చెందడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment