అయ్యో.. ఇంగ్లండ్‌ | Jason Roy ruled out of Australia clash | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఇంగ్లండ్‌

Published Mon, Jun 24 2019 6:40 PM | Last Updated on Mon, Jun 24 2019 6:41 PM

Jason Roy ruled out of Australia clash - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఇప్పటికీ గాయాల బెడద వేధిస్తూనే ఉంది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతను కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని  టీమ్ ఫిజియోథెర‌పిస్ట్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌బోయే కీలక మ్యాచ్‌కు సైతం జేస‌న్ రాయ్ దూరం కానున్నాడు. ఇది ఇంగ్లండ్‌ను కలవరపరుస్తోంది. అన్ని విభాగాల్లోనూ అదరగొడుతూ వరుస విజయాలు సాధిస్తున్న ఆసీస్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్‌ పూర్తి స్థాయిలో సన్నద్ధం  కావాలని భావించింది. ఆ క్రమంలోనే ఆసీస్‌తో మ్యాచ్‌ నాటికి అందుబాటులోకి జేసన్‌ రాయ్‌ తిరిగి జట్టులో చేరతాడని ఆశించింది. కాగా, రాయ్‌ ఇంకా తొడ కండరాల గాయం నుంచి కోలుకోలేకపోవడంతో రేపటి మ్యాచ్‌పై ఇంగ్లండ్‌ ఆందోళన చెందుతుంది.

వెస్టిండీస్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా జేస‌న్ రాయ్ గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఫీల్డింగ్ స‌మ‌యంలో బంతి కోసం ప‌రుగెత్తిన జేస‌న్ రాయ్‌కు కాలి కండ‌రాలు ప‌ట్టేశాయి. దీనితో అప్ప‌టిక‌ప్పుడు గ్రౌండ్‌ను వ‌దిలి వెళ్లాడు. అనంత‌రం వ‌రుస‌గా నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల్లో విఫ‌లం అవుతూ వ‌చ్చాడు. ఇందులో భాగంగా ప‌రుగెత్తుతున్న స‌మ‌యంలో కాలి కండ‌రాల్లో నొప్పి క‌లుగుతోంద‌ని ఫిజియో వెల్ల‌డించారు.నెట్ ప్రాక్టీస్ స‌మ‌యంలోనూ ఇదే స‌మ‌స్య ఉత్ప‌న్న‌మౌతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ కార‌ణంతోనే మొన్న‌టి అఫ్గానిస్తాన్‌, శ్రీలంక‌తో మ్యాచ్‌కు కూడా జేస‌న్ రాయ్ దూరం అయ్యాడు. అయితే అఫ్గాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించినా.. లంకేయులు చేతిలో ఓటమి పాలైంది. ప్ర‌స్తుతం జేస‌న్ రాయ్ స్థానంలో జేమ్స్ విన్సీ ఓపెన‌ర్‌గా ఆడుతున్నాడు. బెయిర్‌స్టోతో క‌లిసి ఇన్నింగ్‌ను ఆరంభిస్తున్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌కు సైతం విన్సేనే ఓపెనర్‌గా దిగుతాడని ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ స్పష్టం​ చేశాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో నాల్గో స్థానంలో కొనసాగుతోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement