హైదరాబాద్: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌కు పబ్లిసిటీ పిచ్చి సోకినట్టుంది. తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పట్లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ముస్లిం కాబట్టే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని.. తనను బతిమాలితే హార్దిక్ పాండ్యాను ప్రపంచ శ్రేణి ఆల్‌రౌండర్‌ను చేస్తానని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా మరో స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాపై తన అక్కసును వెల్లగక్కాడు ఈ పాక్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్. బుధవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రజాక్ బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నేను ప్రపంచ వ్యాప్తంగా అన్ని మైదానాల్లో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. దీంతో బుమ్రా నాకు పెద్ద సమస్యే కాదు. నా దృష్టిలో బుమ్రా బేబీ బౌలర్. అతడి బౌలింగ్‌లో అవలీలగా పరుగులు
సాధిస్తా. గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం ఆక్రమ్, షోయాబ్ అక్తర్ వంటి ఆల్‌టైమ్ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్‌మన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా విషయంలో అదే జరిగింది. నేను క్రికెట్ ఆడే సమయంలో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాననే విషయం బుమ్రాకు కూడా తెలుసు
1992 నుంచి 2007 మధ్య కాలంలో క్రికెట్ ఆడిన ఆటగాళ్లను, ఫ్యాన్స్‌ను అడగండి అసలు క్రికెట్ అంటే ఏమిటి? దాని మజా ఏంటని?. వాళ్లు మాత్రమే దానికి సమాధానం చెబుతారు. అప్పటివారు నిజమైన వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. ప్రస్తుత క్రికెటర్లు సుదీర్ఘ కాలం ప్రపంచ శ్రేణి ఆటగాళ్లుగా కొనసాగలేరు. ప్రస్తుత క్రికెటర్ల బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అంతగా పస ఉండటం లేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లి నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. మంచి ప్లేయర్. కానీ సచిన్ టెండూల్కర్‌తో పోల్చలేము. వీరిద్దరిని ఓకే దృష్టిలో చూడలేము. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు’అంటూ రజాక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment