
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కాగా అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా ఉమేశ్ యాదవ్ 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా చివరిసారిగా మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల జరిగిన టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు టెస్టు మ్యాచుల్లో మొత్తంగా 13 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ పేసర్.. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మూడో భారతీయ బౌలర్‌గా నిలిచాడు. కాగా గురువారం నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు.
టీమిండియా టెస్టు జట్టు వివరాలు
విరాట్ కోహ్లి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్
Comments
Please login to add a commentAdd a comment